
అన్ని శాఖల సమన్వయంతో రోడ్డు భద్రతా చర్యలు
పరవాడ: రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. అనకాపల్లి–విశాఖ జాతీయ రహదారి లంకెలపాలెం కూడలిలో ఈ నెల 23న జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ప్రమాదం తీరు తెన్నులను ట్రాఫిక్ పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు భద్రత పరిరక్షణ చర్యలపై రోడ్డు ఇంజినీరింగ్‌లో తగు మార్పులు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా రవాణాశాఖ అధికారి జి.మనోహర్, పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్‌లతో సమీక్ష జరిపారు. అలాగే ప్రమాద స్థలంలో ట్రాఫిక్ నిబంధనలు అమలు, వేగ నియంత్రణ, సిగ్నల్ వ్యవస్థ నిర్వహణ, ప్రమాదకరంగా ఉన్న మలుపులు, డివైడర్లు, సైన్ బోర్డుల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్ష జరిపి, సూచనలిచ్చారు. ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడగా 15 మంది గాయపడ్డారని, క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పోలీసు అధికారులు ఎస్పీకి వివరించారు. సమీక్షలో రవాణా శాఖాధికారి జి.మనోహర్, పరవాడ సబ్‌డివిజన్ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కె.ప్రవీణ్‌కుమార్, పి.గోపీకృష్ణ, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
● ఎస్పీ తుహిన్ సిన్హా