ఉపాధి కూలీగా సర్పంచ్..
కోటవురట్ల: అతనో గ్రామానికి సర్పంచ్. అయినా తెల్ల చొక్కా వేసుకుని ఊరకే కూర్చోలేదు. పని చేస్తేనే ఎవరికై నా ఆరోగ్యం, కుటుంబానికి ఆసరా ఉంటుందని భావించారు. నలుగురూ ఓ చోట చేరి పనిచేస్తే వారి మధ్య అనుబంధం, ఆత్మీయత పెరుగుతాయని తలంచారు. ఉపాధి హామీ పథకంలో ఓ కూలీగా జాబ్‌కార్డు తీసుకుని అందరితో పాటు తానూ పనిచేస్తూ ఆదర్శంగా నిలిచారు. అతనే చినబొడ్డేపల్లి గ్రామ సర్పంచ్ పైల శివరామ్. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుతో సర్పంచ్‌గా గెలిచారు. ఆనాటి నుంచి గ్రామ సమస్యలను పరిష్కరించడంలో చురుగ్గా వ్యవహరిస్తూ ఉపాధి హామీ పథకంలో చేరి నేటి తరం యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఉద్యోగం లేదని నిరాశ నిస్పృహలలో కుంగిపోకుండా అందుబాటులో ఉన్న ఏదొక పని చేసుకుంటూ గొప్ప స్థాయికి చేరుకునేందుకు మరింత ఉత్సాహంగా మార్గాలను వెతుక్కోవాలని సర్పంచ్ శివరామ్ చెబుతున్నారు.


