
నేరచరితులపై ప్రత్యేక నిఘా పెట్టండి
అనకాపల్లి: నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై ఆయా ప్రాంతాల పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని, పాత కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపర్చాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండిగ్ కేసులు, ఎన్‌డీపీఎస్ కేసులు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్, రోడ్డు ప్రమాదాలు, సాధారణ మరణాలు, ఇతర కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేసుల దర్యాప్తు పురోగతిపై అధికారుల నుంచి సమగ్ర సమాచారం తీసుకొని, కేసుల ఛేదన త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. న్యాయస్థానాల్లో నేరస్తులకు శిక్ష పడేలా పటిష్ట ఆధారాలతో కేసులను ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. రాత్రి సమయంలో గస్తీలను ముమ్మరం చేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ విస్తృతం చేయాలని, రాత్రి సమయంలో రహదారులపై తిరుగుతున్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. డయల్ 112కు వచ్చే కాల్స్‌కు త్వరగా స్పందించి, శిక్షణతో కూడిన టీమ్‌లు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు భరోసా కల్పించాలన్నారు. గంజాయి అక్రమ రవాణా పాల్పడుతున్న స్మగ్లర్ల ఆస్తుల జప్తునకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారిని డీ–అడిక్షన్ సెంటర్లలో చేర్పించేలా కుటుంబ సభ్యులను చైతన్యపరచాలన్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో యాక్ట్, మహిళా చట్టాలు, సైబర్ నేరాలపై విద్యార్థులలో అవగాహన కల్పించాలన్నారు. పేకాట, కోడి పందేలు, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు. గ్రామాలను సందర్శించి, నేర ప్రవర్తన గల వ్యక్తుల స్థితిగతులను తెలుసుకోవాలని, ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చైతన్యపరచాలని సూచించారు. అనంతరం వివిధ కేసుల్లో పురోగతి సాధించిన 56 మంది పోలీస్ సిబ్బందిని ప్రశంసా పత్రాలతో ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జి.ఎస్.ఎన్.వి.ప్రసాదరావు, కె.జగదీశ్వరరావు, డీఎస్పీలు బి.మోహనరావు, సీఐలు టి.వి.విజయకుమార్, పి.శ్రీనివాసరావు, ధనంజయరావు, లక్ష్మణమూర్తి, బెండి వెంకటరావు, బాల సూర్యరావు, టి.లక్ష్మి, రమేష్, ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.
సమీక్ష సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హా