
‘రైవాడ’ ఆధునికీకరణ తక్షణ అవసరం
దేవరాపల్లి: స్పిల్వే గేట్లు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో రైవాడ జలాశయానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న అన్నారు. ఈ మేరకు రైవాడ జలాశయ స్పిల్వే గేట్ల ప్రాంతాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైవాడ ప్రాజెక్టు నిర్మించి సుమారు ఐదు దశాబ్దాలు కావస్తుందన్నారు. ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పును ఇరిగేషన్ అధికారులు గుర్తించి, ఆధునికీకరణ కోసం ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రపంచ బ్యాంక్ నిధులు రూ.336 కోట్లతో ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించినా అతీగతీ లేదన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యంత కీలకమైన ప్రాజెక్టు పట్ల పాలకులు నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. ఇప్పటికై నా పాలకులు తక్షణమే స్పందించి ప్రాజెక్టు ఆధునికీకరణకు నిధులు మంజూరు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని వెంకన్న డిమాండ్ చేశారు.