
మామిడి తాండ్ర పుల్లన
మామిడి తాండ్ర తయారు చేస్తున్న దృశ్యం
నక్కపల్లి : ప్రతి ఏటా మామిడి సీజన్‌లో ఏర్పాటయ్యే తాండ్ర తయారీ దుకాణాలు రెండేళ్ల నుంచి కానరావడం లేదు. నక్కపల్లి మండలంలో మామిడి తాండ్ర తయారీ దుకాణాలు కొన్నేళ్లుగా ఎక్కువగా ఏర్పాటు చేసేవారు. ఈ సీజన్‌లో నియోజకవర్గంలో పలు ప్రాంతాలతో మామిడి తాండ్ర తయారీ కానరాలేదు. నక్కపల్లి మండలంలో వేంపాడు, చినదొడ్డిగల్లు, కాగిత, రేబాక, రమణయ్యపేట, తదితర ప్రాంతాల్లో మామిడి తాండ్ర తయారీ అధికంగా జరిగేది. ఈ ప్రాంతాల్లో సుమారు 15 వరకు మామిడి తాండ్ర దుకాణాలు ఏర్పాటు చేసేవారు. మామిడి గుజ్జును తాండ్రగా తయారు చేసి స్థానికంగా విక్రయించడంతో పాటు, ఇతర ప్రాంతాలకు సుమారు 50 నుంచి 100 టన్నుల వరకు ఎగుమతి చేసేవారు. తాండ్ర తయారీపై చుట్టు పక్కల సుమారు 100 మంది వరకు ఉపాధి పొందేవారు. మరో 50 మంది వరకు తాండ్రను కాగిత టోల్‌ప్లాజా వద్ద కిలోల చొప్పున ప్యాక్ చేసి బస్సుల్లోను, కారుల్లోను వెళ్లేవారికి విక్రయించేవారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో సైకిళ్లపై వెళ్లి విక్రయించేవారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా మామిడి కాయల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో దాదాపు 15 వేల హెక్టార్లలో మామిడితోటలు ఉన్నాయి. చాలా తోటల్లో పూతదశలో తెగుళ్లు రావడం, పొగమంచు కారణంగా మామిడి కాయలు కాయలేదు. దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఈ ఏడాది మామిడి పండ్లకు గిరాకీ పెరిగింది. దిగుబడి ఎక్కువగా ఉన్న సమయంలో కలెక్టర్, సువర్ణరేఖ, నీలం, దేశవాళి, బంగినపల్లి, రసాలు వంటి రకాలను కొనుగోలు చేసి గుజ్జు చేసి తాండ్ర తయారీకి ఉపయోగించేవారు.
ధరలు చూస్తే బేజారు..: మామిడి దిగుబడి తగ్గిపోవడంతో ధర కూడా విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం కలెక్టర్ మామిడి కాయలు టన్ను రూ.35 వేలు ఉంది. బంగినపల్లి రకాలయితే టన్ను రూ.40వేల వరకు ఉంది. సువర్ణరేఖ రూ. 50 వేలకు పైబడే ఉంది. దీంతో తాండ్ర తాయారీకి వెనుకడుగు వేస్తున్నారు. రసాలు, దేశవాళీ, ఇతర జాతులకు చెందిన మామిడి కాయలు సైతం టన్ను రూ.20 వేల పైబడి మాటే. అంత ధర పెట్టి కాయలను కొనడంతో పాటు ముడిసరకులు, ఇతర ఖర్చులకు గిట్టుబాటు కాదని భావించిన వ్యాపారులు ఈ ఏడాది తాండ్ర తయారీకి స్వస్తి పలికినట్టు సమాచారం. కార్మికులకు వేతనం రూ.500 నుంచి రూ. 800 వరకు చెల్లించాల్సి వస్తుంది. స్థానికంగా ఉండే కమీషన్ వ్యాపారులు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన మామిడి కాయలను తాము అనుకున్న ధర రావడంతో దేశవాళీ, కలెక్టర్, ఇతర జాతులకు చెందిన రకాలను జ్యూస్‌ల కోసం ఎగుమతి చేస్తున్నారు. దీంతో తాండ్ర తయారీకి అవసరమైన మామిడి కాయలు అందుబాటు ధరల్లో లభించడం లేదు. ఈ ధరలకు కాయలు కొని తాండ్ర తయారు చేసినా అధిక ధరలకు విక్రయించాల్సి ఉంటుంది. దీంతో అమ్మకాలు తగ్గిపోతాయి. గత ఏడాది మామిడి తాండ్ర కిలో రూ.500 ఉంటే ఈ ఏడాది రూ. 800లకు విక్రయిస్తే తప్ప గిట్టుబాటు కాదు. పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. దీంతో నష్టాలను చవి చూడాల్సి వస్తుందని భావించి తాండ్ర తయారీకి స్వస్తి పలికినట్టు తయారీదారులు చెబుతున్నారు.
తగ్గిన మామిడి దిగుబడి
తాండ్ర తయారీకి వెనకడుగు
పెరిగిన ముడిసరుకు, తయారీ ఖర్చులు
గిట్టుబాటు కాక ఏర్పాటు కాని దుకాణాలు
గిట్టుబాటు కాని తాండ్ర
చిన దొడ్డిగల్లు పరిసర ప్రాంతాల్లో గతంలో ఐదు మామిడి తాండ్ర దుకాణాలు ఉండేవి. రెండేళ్ల నుంచి దిగుబడి అంతంతమాత్రంగానే ఉండడంతో ముడిసరకు ధరలు పెరిగిపోయాయి. దీంతో తాండ్ర తయారీకి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక్కడ తయారు చేసిన తాండ్రను స్థానికంగా విక్రయించడంతో పాటు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే వారు. ఈ ఏడాది ఒక్క దుకాణం కూడా ఏర్పాటు కాలేదు. కూలీలు కూడా తాండ్ర తయారీ లేక ఉపాధి పనులకు, భవన నిర్మాణ పనులకు వెళ్లిపోతున్నారు.
– తోటసత్తిబాబు, కమిషన్ దుకాణం నిర్వహకుడు, చినదొడ్డిగల్లు