
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి దుర్మరణం
కశింకోట: మండలంలోని బయ్యవరం పాల డెయిరీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఎస్‌ఐ లక్ష్మణరావు అందించిన వివరాల ప్రకారం...విశాఖపట్నం నుంచి నరసాపురం వెళుతున్న కారు, బయ్యవరం పాల డెయిరీ వద్ద అవతలి రోడ్డులోకి అకస్మాత్తుగా మలుపు తిరుగుతున్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న బుంగా వెంకట నరసమ్మ (72) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు నరేష్, మేనకోడలు సువర్ణ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజిహెచ్‌కు వైద్యులు సిఫారసు చేశారు. విశాఖలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న నరేష్, తమ తల్లి నరసమ్మ, కుటుంబ సభ్యులు సువర్ణ, ముగ్గురు పిల్లలతో కలిసి కారులో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బంధువుల ఇంటికి పెళ్లికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. నరసమ్మ మృతదేహానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జయి దెబ్బతింది. తన కళ్లముందే తల్లి నరసమ్మ మృతి చెందడంతో నరేష్, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి దుర్మరణం