
ఆర్‌ఆర్ ప్యాకేజీ రూ.25 లక్షలు ఇవ్వాల్సిందే
నక్కపల్లి : ఏపీఐఐసీకి భూములిచ్చిన రైతులు, నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు చెల్లించాల్సిందేనని పలువురు రైతులు కోరారు. మంగళవారం చందనాడ, అమలాపురం, మూలపర గ్రామాల్లో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి అర్హత సాధించిన రైతులు, నిర్వాసితుల జాబితాలు ప్రకటించేందుకు గ్రామసభ నిర్వహించారు ఆర్‌డీవో రమణ అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో ప్రభుత్వం ప్రకటించిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వివరాలను ఆర్‌డీవో వెల్లడించారు. ఐదు సెంట్ల ఇంటి స్థలంతో పాటు ప్యాకేజీ కింద రూ.8.30 లక్షలు నిర్ణయించడం జరిగిందన్నారు. దీనిపై రైతునాయకులు సూరాకాసుల గోవిందు,గంటా తిరుపతిరావు, తళ్ల భార్గవ్, తళ్ల అప్పలస్వామి, పెదకాపు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ చాలదన్నారు. పదేళ్ల క్రితం భూములు ఇస్తే ఇప్పుడు నష్టపరిహారం, ప్యాకేజీ చెల్లిస్తున్నారని, అప్పటికీ ఇప్పటికీ మార్కెట్‌ధరల్లో చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు చెల్లించాలన్నారు. పెళ్లికాని మహిళలకు కూడా ప్యాకేజీ వర్తింపజేయాలన్నారు. డీఫారం భూముల్లో ఉన్న చెట్లక , వ్యవసాయ బోర్లకు, బావులకు సైతం నష్టపరిహారం చెల్లించాల్సిందేనన్నారు. ప్యాకేజీ వ్యవహారం తేల్చకుండా భూములు స్వాధీనం చేసుకుని పనులు ప్రారంభించడం తగదన్నారు. తహసీల్దార్ నర్సింహమూర్తి డీటీ నారాయణరావు, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.