
బండారు అప్పన్న మృతిపై డీఎస్పీ విచారణ
నర్సీపట్నం: నర్సీపట్నం మండలం, వేములపూడిలో నవంబరు 5న చోటు చేసుకున్న బండారు అప్పన్న మృతిపై డీఎస్పీ పి.శ్రీనివాసరావు విచారణ జరిపారు. మృతుడి తండ్రి బండారు మహాలక్ష్మి, కుటుంబ సభ్యులు కేసును నీరుగార్చుతున్నారంటూ సోమ వారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ విజయకృష్ణన్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మంగళవారం మృతుడి తండ్రి మహాలక్ష్మి, కుటుంబ సభ్యులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ముందుగా మృతుడి తండ్రిని, తరువాత కుటుంబ సభ్యులు గోవింద, చిన్ని, మంగను విడివిడిగా విచారించారు. కుమారుడుని కోల్పోయాను కేసు నీరుగార్చకుండా న్యాయం చేయాలని డీఎస్పీకి విన్నవించానని మహాలక్ష్మి తెలిపారు. కేసులో పురోగతి లేకపోవడం వల్లనే కలెక్టర్‌ను ఆశ్రయించానని, ఇప్పటికై నా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. కత్తిగాటు, కర్రతో కొట్టినట్టు ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదమని ఎలా నమ్ముతామని అన్నారు. ఇప్పటికై నా పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపితే దోషులు బయటపడతారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే తన కొడుకు మృతికి గల కారకులను బయటపెట్టి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని డీఎస్పీని కోరడం జరిగిందని తెలిపారు.