భంగపడ్డ గంగపుత్రులు | - | Sakshi
Sakshi News home page

భంగపడ్డ గంగపుత్రులు

May 21 2025 1:57 AM | Updated on May 21 2025 1:57 AM

భంగపడ

భంగపడ్డ గంగపుత్రులు

వేష నిషేధ భృతి మంజూరులో అవకతవకలు

‘‘అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీ పరిధిలో అర్హత ఉన్న 300 మంది మత్స్యకారులకు వేట నిషేధ భృతి రాలేదు. మొత్తం 367 బోట్లు రిజిస్టర్‌ అయినవి ఉన్నాయి. ప్రతీ బోటుకు ఆరుగురు ఉంటారు. అందులో ఐదుగురు అర్హులకు మాత్రమే భృతి వచ్చింది. ఆరో వ్యక్తిగా కూటమి నేతలు తమకు అనుకూలమైన వ్యక్తి పేరును నమోదు చేసుకున్నారు. ఇలా అర్హత ఉండి రాని వారు.. వాడమొదల తాతారావు (బోట్‌ నెం.ఏపీ–వీ3–ఎండీ–120), మడ్డు మత్తురాజు (బోట్‌ నెం.ఏపీ–వీ3–ఎండీ–120), తెడ్డు అప్పన్న (బోట్‌ నెం.ఏపీ–వీ3–ఎండీ–159), కంబాల మౌళి (ఏపీ–వీ3–ఎండీ–120), వాడమొదల సత్తియ్య (ఏపీ–వీ3–ఎండీ–61), వాడమొదల నూకరాజు(ఏపీ–వీ3–ఎండీ–1688)’’

పూడిమడకకు చెందిన కౌవిరి బాపయ్య అనే మత్స్యకారుడికి ఒక్క సెంటు భూమి కూడా లేదు. కానీ ఆయనకు 80 ఎకరాల భూమి ఉన్నట్లు చూపించి నిషేధ భృతి ఆపేశారు. ఎందుకు రాలేదని సచివాలయ ఉద్యోగులను అడిగితే నీ పేరు మీద 80 ఎకరాలున్నట్లు చూపిస్తోందని చెప్పే సరికి బాపయ్య ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా మంది అర్హులైన మత్స్యకారులకు ఏదో ఒక కారణం చూపించి నిరాకరించారు.

సాక్షి, అనకాపల్లి: మత్స్యకారుల సేవలో.. అని పేరు పెట్టారు. చివరకు వారి కడుపు కొట్టారు. అధికారంలోకి వచ్చాక తొలి సంవత్సరం వేట నిషేధ భృతి ఎలాగూ ఇవ్వలేదు. కనీసం రెండో సంవత్సరమైనా పద్ధతిగా ఇచ్చారా.. అంటే అదీ లేదు. భృతి అందుకున్న లబ్ధిదారుల వివరాలు సేకరిస్తే కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఎందరో అనర్హులు లబ్ధి పొందినట్టు తేటతెల్లమయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో ‘మత్స్యకార భరోసా’ పొందిన వారిలో అర్హత ఉన్న సుమారు 2 వేల మందికి ఈసారి భృతి అందలేదు. ఒక్కో బోటులో అర్హత లేని కూటమి పార్టీల అనుకూల మత్స్యకారులకు భరోసా కల్పించారు. వేట మీదే ఆధారపడి జీవించే గిరిపుత్రులకు అన్యాయం చేశారు. దీనిపై కలెక్టర్‌కు, జిల్లా మత్స్యకార అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. వేట నిషేధ కాలంలో అప్పులు చేసి, కాలం గడుపుతామని, భృతి మంజూరులో రాజకీయం చేసి తమ కడుపు కొట్టడం అన్యాయమని గంగపుత్రులు వాపోతున్నారు. తీరంలో ఉన్న ఆరు మండలాల పరిధిలోని 31 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 12,644 మత్స్య కుటుంబాలు కేవలం చేపల వేట, విక్రయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి.

కూటమికి అనుకూలంగా ఉన్నవారికే భృతి

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాకముందు వేట నిషేధ భృతి మొక్కుబడిగా అందించేవారు. రూ.5 వేల చొప్పున నిషేధం ముగిసిన చాలా కాలానికి ఇచ్చేవారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక భృతిని రూ.10 వేలకు పెంచడమే కాక ఠంఛనుగా వేట నిషేధ సమయంలో అందించేవారు. కూటమి పార్టీలు ఆ పరిహారాన్ని రెట్టింపు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినా.. దాన్ని మొదటి ఏడాది విస్మరించారు. రెండో ఏడాది ఇచ్చినా తీరని అన్యాయం చేశారు. రీసర్వే పేరిట అర్హులను తొలగించి, తమకు అనుకూలంగా ఉన్నవారికి లబ్ధి చేకూర్చారు.

అర్హత ఉన్నవారిని కాదని అనర్హులకు నిషేధ భృతి గత లబ్ధిదారుల్లో కొందరికి నిలిపివేత బోటులో వేటకెళ్లే మత్స్యకారుల బృందంలో ఒకరిద్దరి పేర్లు కూటమి నేతలకు అనుకూలురవే జిల్లా వ్యాప్తంగా 1580 మందిమత్స్యకారులకు నిలిచిపోయిన భృతి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

ఉద్యమిస్తాం..

కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వానికి మత్స్యకారుల ఓట్లే కావాలి.. వారి సమస్యలు, వెతలు వినపడవు. వేట నిషేధ భృతి మొదటి ఏడాది ఇవ్వలేదు. రెండో ఏడాదిలో జిల్లాలో సుమారుగా 1500 మందికి అందలేదు. ఎన్నికల్లో కూటమి పార్టీలకే మత్స్యకారులు ఎక్కువగా ఓట్లు వేశారు. నమ్మిన వారిని మోసం చేయడం తగదు. అర్హులకు వేట నిషేధ భృతి అందకపోతే ఉద్యమానికై నా సిద్ధమే.

– చోడిపల్లి శ్రీనివాసరావు, మాజీ మత్స్యకార కార్పొరేషన్‌ డైరెక్టర్‌

చేదు వాస్తవాలు

2023లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 11,500 మంది మత్స్యకారులకు నిషేధ భృతి అందించారు. 2024లో కూటమి ప్రభుత్వం మత్స్యకార భరోసా కల్పించలేదు.

2025లో జిల్లాలో నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్‌.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ మండలాల్లో 11,544 మందికి రూ.23.28 కోట్లు భృతి అందించారు.

వీరు కాకుండా అర్హత ఉన్న సుమారుగా 1580 మందికి మత్స్యకారులు వేట నిషేధ భృతి రాలేదు. వీరిలో అచ్యుతాపురం మండలంలో 400 మంది మత్స్యకారులు, రాంబిల్లి, పరవాడ మండల పరిధిలో 200 మంది, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల పరిధిలో 400 మందికి పైగా మత్స్యకారులు ఉన్నారు.

విద్యుత్‌ బిల్లులు ఎక్కువగా వచ్చాయని, కార్లు, భూములు ఉన్నాయని లేకపోయినా ఉన్నట్లు చూపించి సుమారు 500 మంది మత్స్యకారులను అనర్హులుగా పక్కన పెట్టారు.

పేదవారితో రాజకీయమా?

అర్హత ఉన్న మత్స్యకారులందరికీ నిషేధ భృతి ఇవ్వాలి. వేటకెళ్లే వారెవరో.. వెళ్లని వారెవరో సచివాలయంలో ఉన్న అధికారులకు తెలియదా..? వారికి అన్నీ తెలిసే స్థానిక కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వేటకెళితేగానీ పూటగడవని మత్స్యకారులున్నారు. అలాంటి వారికి ఇవ్వాల్సిన భృతిని కూడా నిలిపివేసి రాజకీయాలు చేస్తున్నారు.

– ఉమ్మిడి జగన్‌, మత్స్యకార నాయకుడు, పూడిమడక

బోటుకు రెండు అనధికార పేర్లు..

రిజిస్ట్రేషన్‌ అయిన ప్రతి బోటుకు ఒకటి లేదా రెండు అనర్హుల పేర్లు చేర్చారు. వారికి నిషేధ భృతి ఇచ్చారు. ఈ అవకతవకల్లో స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ ఉద్యోగులు కూడా భాగస్వాములుగా ఉన్నారు. మత్స్యకార భరోసాకు అర్హత ఉన్న సూరాడ కోదండరాం అనే బోట్‌ ఓనర్‌కు కూడా భృతి రాలేదు. అధికారులు పరిశీలించి అర్హులైన అందరికీ భృతి అందించాలి.

– వాసుపల్లి శ్రీనివాసరావు, మత్స్యకారుడు,

పూడిమడక

టెక్నికల్‌ సమస్య కారణంగా కొందరికి రాలేదు

వేట నిషేధ భృతి అర్హత ఉన్న ప్రతీ మత్స్యకారుడికీ ప్రభుత్వం అందించింది. చిన్నపాటి టెక్నికల్‌ సమస్య కారణంగా కొందరికి రాలేదని మా వరకూ వినతులు వచ్చాయి. అర్హత ఉండి భృతి రాని వారందరి నుంచి దరఖాస్తులు కోరుతున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే అందిస్తాం.

– ప్రసాదరావు,

మత్స్యకార జిల్లా జేడీ

భంగపడ్డ గంగపుత్రులు1
1/5

భంగపడ్డ గంగపుత్రులు

భంగపడ్డ గంగపుత్రులు2
2/5

భంగపడ్డ గంగపుత్రులు

భంగపడ్డ గంగపుత్రులు3
3/5

భంగపడ్డ గంగపుత్రులు

భంగపడ్డ గంగపుత్రులు4
4/5

భంగపడ్డ గంగపుత్రులు

భంగపడ్డ గంగపుత్రులు5
5/5

భంగపడ్డ గంగపుత్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement