
లైటరైట్ అనుమతులు రద్దు చేయాలి
నాతవరం : లేటరైట్ తవ్వకాల వల్ల గిరిజనులకు అన్ని విధాలుగా నష్టం జరుగుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు పేర్కొన్నారు. సుందరకోట పంచాయతీ శివారు బమిడికలోద్దు ప్రాంతంలో లేటరైట్ తవ్వకాలు జరిపి లారీలపై తరలిస్తున్న రోడ్డు మార్గాన్ని శనివారం సీపీఐ బృందం సందర్శించారు. కాకినాడ జిల్లా రవతలపూడి మండలం తూళ్లూరు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన లేటరైట్ మట్టిని నిల్వ చేసే యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. లేటరైట్ తవ్వకాలను సీపీఐ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. లేటరైట్ ఇతర మైనింగ్ తవ్వకాల కారణంగా చుట్టుపక్కల గిరిజన గ్రామాలు పూర్తిగా నాశనమౌవుతాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి లేటరైట్ అనుమతులు రద్దు చేసి తవ్వకాలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ ప్రాంత గిరిజనులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, జిల్లా నాయుకులు గురుబాబు, క్రాంతి, నాతవరం మండలం సీపీఐ కార్యదర్శి చిన్నయ్యనాయుడు, అప్పారావు, సత్తిబాబు పాల్గొన్నారు.
మైనింగ్ మాఫియాకు అధికారులు దాసోహం
నర్సీపట్నం : లేటరైట్ తవ్వకాల్లో అడుగడుగునా అక్రమాలు జరుగుతున్నాయని, మైనింగ్ మాఫియాకు అధికారులు దాసోహమయ్యారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ నాతవరం మండలం, సరుగుడు ప్రాంతంలో లేటరైట్ తవ్వకాల్లో అడుగడుగునా అవినీతి చోటు చేసుకుందన్నారు. విచ్చలవిడిగా లేటరైట్ తవ్వకాలపై మైనింగ్ అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్నారు. బమిడికలొద్ది గ్రామంలోని జర్తా లక్ష్మణ్‌రావు పేరున ఉన్న 121 హెక్టార్లలో అనేక అక్రమాలు జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడలేదన్నారు. లేటరైట్ రవాణా వాహనాల్లో తప్పనిసరిగా జీపీఎస్ పరికరాలు అమర్చాల్సి ఉందన్నారు. సుస్థిర అభివృద్ధి చట్టం(2016) ప్రకారం గనిలో వేంబ్రిడ్జి ఉండాలన్నారు. ఎంఎండీఆర్ చట్టం 1957 సెక్షన్ 21(4) చట్టబద్దమైన పర్మిట్ లేకుండా మినరల్స్ రవాణా చేయడం నిషేధమన్నారు. లేటరైట్ అక్రమ తవ్వకాలకు సహకరిస్తున్న అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.