
మోదకొండమ్మ తల్లికి వెండి కవచం, త్రిశూలం
మాడుగుల: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు మాడుగుల మోదకొండమ్మ అమ్మవారి పండగ వచ్చే నెల 3వ తేదీన జరగనున్న నేపథ్యంలో వెండి కవచం, వెండి త్రిశూలం చేయించారు. వాటిని గురువారం అమ్మవారికి అలంకరించారు. ఈ ఏడాది జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు తెలిపారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనాథు శ్రీనివాసరావు, సర్పంచ్ ఎడ్ల కళావతి, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
వాడపల్లికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
డాబాగార్డెన్స్ : తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తుల కోసం ఏపీఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతుందని జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు పేర్కొన్నారు. ప్రతి శనివారం ఉదయం 4 గంటలకు ద్వారకా బస్‌స్టేషన్ నుంచి బయలుదేరి వాడపల్లి చేరుకుంటుందని, భక్తుల ప్రదక్షిణలు, స్వామి దర్శనం అనంతరం సాయంత్రం 4 గంటలకు వాడపల్లిలో బయలుదేరి రాత్రి 9 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని చెప్పారు. ప్రయాణ చార్జీ(ఒక్కొక్కరికి) సూపర్ లగ్జరీ రూ.1000గా నిర్ణయించామని, టికెట్లు కావల్సిన వారు https://www.apsrtconline.in లో రిజర్వ్ చేసుకోవాలని కోరారు. వివరాలకు 9959225602, 9052227083, 9959225594, 9100109731 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.