
ఉపాధి మేట్ తొలగింపుపై నిరసన
చీడికాడ : నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి హామీ మేట్‌ను తొలగించి కూటమి నేతలకు అనుకూలంగా ఉన్న మరో వ్యక్తిని నియమించడంపై మండలంలోని బైలపూడికి చెందిన ఉపాధి కూలీలు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు. వీరికి వైఎస్సార్‌సీపీ నేతలు అండగా నిలిచారు. గ్రామానికి చెందిన 38 సభ్యులు(కూలీలు)గల చంద్రాదేవి గ్రూపునకు జాజిమొగ్గల చంద్రదేవి మేట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె వైఎస్సార్‌సీపీ సానుభూతిపరురాలిగా భావించిన స్థానిక కూటమి నేతలు తనను ఎలాగైనా మేట్ పదవి నుంచి తప్పించాలని కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారని కూలీలు గాడి కన్నతల్లి, లక్ష్మి, మోసూరి లక్ష్మి, మహాలక్ష్మి, జె.అప్పారావు, లక్ష్మి తెలిపారు. ఈ విషయం తమకు తెలిసి ముందస్తుగానే నెలరోజుల క్రితం ఏపీవో గంగునాయుడు దృష్టికి తీసికెళ్లి మేట్‌ను మార్చవద్దని లిఖితపూర్వకంగా చెప్పామన్నారు. అయితే దానిని పక్కన పడేసి వీఆర్‌పి గాడి లక్ష్మి ఆమె భర్త సత్యనారాయణలు ఏపీవోతో కూడి చంద్రదేవిని తొలగించామని చెప్పారన్నారు. తమ పేరిట తప్పుడు సంతకాలు చేయించుకున్న వీఆర్పీ గాడి లక్ష్మిని, తొలగించడంలో సహకరించిన ఏపీవో గంగరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి నేతల కుట్రలకు ఉద్యోగులు సహకరిస్తే గ్రామాల్లో జరిగే అలజడులకు అధికారులదే బాధ్యత అని, తప్పులు జరగకుండా చూడాలని లేకుంటే ప్రజలు తిరగబడతారని మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు, ఎంపీపీ కురాచా జయమ్మలు ఎంపీడీవో వద్ద హెచ్చరించారు.
దేవరాపల్లి సబ్‌స్టేషన్‌లో చెలరేగిన మంటలు
ఆరు గంటలకు పైగా
నిలిచిన విద్యుత్ సరఫరా
దేవరాపల్లి : దేవరాపల్లి మండలాన్ని బుధవారం అంధకారం అలుముకుంది. మధ్యాహ్నం కురిసిన కొద్దిపాటి వర్షానికి స్థానిక విద్యుత్ స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం నుండి రాత్రి 9:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. ఈ సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలంతా చీకట్లో మగ్గారు.
సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్లు బాగు చేసే వరకు వేచలం సబ్ స్టేషన్ నుంచి మండల కేంద్రం దేవరాపల్లికి విద్యుత్ సరఫరాను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని స్థానిక ఎలక్ట్రికల్ ఏఈఈ కె. శంకరారవు తెలిపారు. కాగా 9:45 గంటల ప్రాంతంలో విద్యుత్‌ను పునరుద్ధరించారు.