
తామరబ్బలో అదుపు తప్పి ఆటో బోల్తా
తామరబ్బలో నుజ్జు అయిన ఆటో (ఇన్‌సెట్)ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
దేవరాపల్లి: మండలంలోని తామరబ్బ సమీపంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తు ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సహా ఒక మహిళకు తీవ్ర గాయాలు కాగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 20 మంది వరకు మహిళా ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సమ్మెద సమీపంలో జీడి తోటల్లో జీడి పిక్కలు సేకరించేందుకు(ఏరడానికి) రైవాడ గ్రామానికి చెందిన 20 మంది మహిళలు ప్రతి రోజూ కూలీ పని కోసం ఆటోలో వెళ్లి వస్తుంటారు. శుక్రవారం సాయంత్రం పని ముగించుకొని ఇంటికి ఆటోలో బయలుదేరారు. తామరబ్బ వంతెన సమీపంలో ప్రమాదకర మలుపులో ఎత్తుగా ఉన్న రోడ్డు ఎక్కలేక ఆటో అదుపు తప్పి వెనక్కి వెళ్లిపోతూ పక్కనే ఉన్న బండరాయిపై బోల్తా పడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వెంటనే వారిని రక్షించి వేరొక ఆటోలో దేవరాపల్లి పంపించారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కోరి అప్పలరాజు, శీర సింహాచలమ్మ చేతులు విరిగాయి. వంకల అప్పలనర్స, మంగ, లక్ష్మి, దుక్క అప్పలనర్స, నర్సమ్మ, చిన్న, సన్నమ్మ తదితరులు గాయపడ్డారు. వీరికి దేవరాపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం అందించారు.
డ్రైవర్, ఓ మహిళకు తీవ్ర గాయాలు
మిగతా మహిళలకు స్వల్ప గాయాలు
క్షతగాత్రులంతా రైవాడ గ్రామస్తులు

తామరబ్బలో అదుపు తప్పి ఆటో బోల్తా