
దేవాలయాల్లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు
తుమ్మపాల : దేవాలయాలలో నైవేద్యం, ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ఉత్పత్తులను వినియోగించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో దేవదాయశాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. దేవాలయాలలో వినియోగిస్తున్న ఆహార వస్తువులు వివరాలు, వాటి సేకరణ విధానాలు, ప్రస్తుతం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విధానం, పండిస్తున్న పంటలు, వాటి లభ్యత వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, రైతులు పండించే సరుకులకు మార్కెంటింగ్ సదుపాయం కల్పించాలన్నారు. ఈ విధానం అమలు తొలిదశలో దేవాలయాలలో నైవేద్యం, ప్రసాదాలకు కావలసిన సరుకులను ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలని, అందుకుగాను అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దేవదాయశాఖ అధికారులకు ఆదేశించారు. ఏ దేవాలయానికి ఏ వ్యవసాయ రైతు సంఘం ద్వారా సరుకులు సరఫరా చేయాలనే విషయం మ్యాపింగ్ చేసి, ఆ విధంగా సరుకులు సరఫరా చేయాలన్నారు. నూరుశాతం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను మాత్రమే సరఫరా అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని, పర్యవేక్షణ చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. భవిష్యత్తులో దేవాలయాలకు కావలసిన సరుకులన్నింటిని సరఫరా చేయుటకు వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, ప్రకృతి సాగును పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు అధికారి సిహెచ్.లచ్చన్న, జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహనరావు, జిల్లా దేవదాయశాఖ అధికారి కె.ఎల్.సుధారాణి, జిల్లాలో దేవాలయాల ఎగ్జిక్యూటివ్ అధికారులు పాల్గొన్నారు.
100 శాతం క్లోరినేషన్ చేపట్టాలి
వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీరు సమస్య లేకుండా చూడాలని, గ్రామ పంచాయతీల్లో గల వాటర్ ట్యాంకుల్లో 100 శాతం క్లోరినేషన్ చేపట్టాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఎంపీడీవోలను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేపడుతున్న సర్వేలు, పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంఈడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయత్‌రాజ్, గృహనిర్మాణ శాఖల అధికారులతో మాట్లాడారు. సచివాలయాల ద్వారా నిర్వహిస్తున్న సర్వేలన్నింటినీ త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఉపాధి హామీ పథకం లక్ష్యాలను పూర్తిచేయాలని, ఉపాధి కూలీలకు మంచినీరు అందుబాటులో ఉండేలా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గిరి శిఖర గ్రామాల్లో మంచినీటి వసతి కల్పించాలని, గోకులం షెడ్లను వేగంగా పూర్తి చేయాలని, ఇంకా అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు మంజూరైన అదనపు సహాయం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 11న జ్యోతిరావు పులే జయంతిని పురస్కరించుకుని బీసీ కార్పొరేషన్ ద్వారా 400 యూనిట్లను మంజూరు చేసి లబ్ధిదారులకు అందజేయాలని బీసీ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శిరీషారాణి, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డీఆర్‌డీఏ పీడీ శచీదేవి, డ్వారా పీడీ పూర్ణిమాదేవి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ఏఎస్‌ఎ. రామస్వామి, డీపీఅర్సీ జిల్లా కో ఆర్డినేటర్ కె.నాగలక్ష్మి, జిల్లా వెనుకబడిన తరగతుల కార్యనిర్వహణ డైరెక్టర్ పెంటోజీరావు పాల్గొన్నారు.
నైవేద్యం, ప్రసాదాల తయారీకి వినియోగం
సమీక్ష సమావేశంలో కలెక్టర్ విజయకృష్ణన్