
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వివాహిత మృతి
సబ్బవరం: మండలంలోని సబ్బవరం కొత్త రోడ్డు సమీపాన గొర్లివానిపాలెం రోడ్డులో ద్విచక్ర వాహనం నుంచి జారిపడిన ఘటనలో కె.కోటపాడుకు చెందిన ఓ వివాహిత మృతి చెందింది. స్థానిక సీఐ పిన్నింటి రమణ తెలిపిన వివరాలిలా.. కె.కోటపాడుకు చెందిన కళ్యాణం ఝాన్సీ(23) తన భర్త మరిడయ్య, ఇద్దరు పిల్లలు డేవిడ్(6), జీవన్‌కుమార్(4)తో కలిసి సబ్బవరంలోని బుడగజంగాల కాలనీలోని తన అమ్మగారి ఇంటికి నాలుగు రోజుల కిందట ద్విచక్ర వాహనంపై వచ్చింది. తిరిగి స్వగ్రామం కోటపాడుకు వెళ్తుండగా.. గొర్లివానిపాలెం రోడ్డులోని నూకాలమ్మ ఆలయ సమీపంలో ద్విచక్ర వాహనం పైనుంచి జారిపడటంతో ఝూన్సీకి తీవ్ర గాయాలయ్యాయి. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం మృతి చెందింది. ఝాన్సీ తండ్రి రాజుబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణ తెలిపారు.