అన్నదాతలను వణికిస్తున్న మిచాంగ్‌ | Sakshi
Sakshi News home page

అన్నదాతలను వణికిస్తున్న మిచాంగ్‌

Published Mon, Dec 4 2023 12:56 AM

యలమంచిలి సమీపంలో ఈదురు గాలులకు నేలకొరిగిన వరి చేను - Sakshi

● చి’వరి’లో రైతన్నలకు కష్టాలు ● తుపాను కారణంగా మారిన వాతావరణం ● కోతకు సిద్ధమైన వరి ● రైతులను అప్రమత్తం చేసిన వ్యవసాయాధికారులు
తీరంలో అలజడి

రైతులు జాగ్రత్తలు పాటించాలి

తుపాను హెచ్చరికల నేపథ్యంలో వరి కోతలు వాయిదా వేసుకోవాలి. ఇప్పటికే కోతలు కోసిన వారు పంటను తక్షణమే పొడి ప్రదేశాలు, గోదాములకు చేర్చాలి. పాక్షికంగా ముదిరిన పంటల్లో వర్షపు నీరు పోవడానికి కాలువలను ఏర్పాటు చేయాలి. పైరు గాలికి పడిపోకుండా 4, 5 దుబ్బులను కలిపి కట్టలుగా కట్టుకోవాలి. ఎక్కడైన పంట కోసి ఉన్నట్టయితే కట్టలను కట్టి గూడు కుప్పలుగా వేసుకోవాలి. ఒకవేళ ధాన్యాన్ని నూర్పిడి చేస్తే తప్పనిసరిగా సురక్షిత ప్రాంతంలో వర్షానికి తడవకుండా ఆరబెట్టుకోవాలి. తగినన్ని టార్పాలిన్లు, పాలిథిన్‌ పట్టాలు అందుబాటులో ఉంచుకుని, తుపాను వెలిసిన తర్వాత ధాన్యాన్ని ఆరబెట్టుకునేలా చూసుకోవాలి.

–బి.మోహనరావు, జిల్లా వ్యవసాయాధికారి

యలమంచిలి(అనకాపల్లి రూరల్‌): బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్‌ తుపాను రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రేయింబవళ్లూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన వరి పంట చేతికందే తరుణంలో తుపాను హెచ్చరికలతో రైతులు కలవరపడుతున్నారు. నీటిఎద్దడిని సైతం ఎదుర్కొంటూ అష్టకష్టాలు పడి రైతులు పంటలను సాగుచేశారు. ఈ ఏడాది పైరు ఎదుగుదల ఆశాజనకంగా ఉంది. మంచి దిగుబడులు వస్తాయనే ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో ఒక్కసరిగా వాతావరణ మార్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వరి పంట చేతికొచ్చే సమయంలో తుపాను బలపడి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ఆందోళన చెందుతున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆదివారం ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఈదురు గాలుల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో పంటను కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నాలు ప్రారంభించారు.జిల్లాలో ఈ ఏడాది రైతులు 1.11 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరినాట్లు ఆలస్యంగాపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరఫరా చేయడం, పెట్టుబడిసాయంతో పాటు సాగుకు అన్నివిధాలా చేయూతనివ్వడంతో అన్నదాతలు ధైర్యంగా సాగు చేపట్టారు. 50 శాతానికి పైగా కోతదశకొచ్చింది. బోర్ల సదుపాయం ఉన్న చోట్ల వరి కోతలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జిల్లాల్లో పలు ప్రాంతాల్లో జిల్లా వ్యవసాయాధికారి మోహనరావు ఆదివారం పర్యటించి రైతులను అప్రమత్తం చేశారు. ఐఎండీ హెచ్చరికల ప్రకారం ఈ నెల 5, 6 తేదీల్లో భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఈ దృష్ట్యా రైతులు కోసిన వరి పంటను సురక్షిత ప్రదేశాలు, గోదాముల్లో భద్రపర్చుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

నేల కొరిగిన పైరు

వరి పైరు ఏపుగా పెరగడంతో ఈదురుగాలులకు కొన్ని చోట్ల పంట నేలకొరిగింది. ఇప్పటివరకూ ఏ నష్టం లేకపోయినా పడిపోయిన పంటపై వర్షం నీరు నిలిస్తే కోసేందుకు కూడా ఉపయోగపడదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. యలమంచిలి సమీపంలో అచ్యుతాపురం రోడ్డు పక్కన ఇప్పటికే కోసిన వరి పనలను దగ్గరుండి స్థానిక ఏఈవో జి.దేముడు, ఎంపీఈవో బి.అరుణ ఆదివారం రైతులతో కుప్పలుగా వేయించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్యం చేయవద్దని రైతులను అప్రమత్తం చేశారు. వరికోతలను వాయిదా వేసుకోవాలని వ్యవసాయాధికారులు తెలిపారు. ఒకవేళ ఎవరైనా కోతలు కోస్తే వరి పనలను ఎట్టి పరిస్థితుల్లోనూ పొలాల్లో ఉంచవద్దని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.కోసిన వరిని టార్పాలిన్లతో కప్పి ఉంచుకోవాలని తెలిపారు.

6వ తేదీ వరకు వానలు

తుపాను ప్రభావంతో సోమవారం నుంచి విశాఖ జిల్లాలో వర్షాలు మొదలు కానున్నాయి. ఐఎండీ నివేదిక ప్రకారం సోమ, మంగళ, బుధవారాల్లో విశాఖతో పాటు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని తెలిపింది.

నక్కపల్లి: మిచాంగ్‌ తుపాను ప్రభావంతో తీరప్రాంతంలో అలజడి మొదలైంది. సముద్రకెరటాలు ఎగిసి పడుతున్నాయి. తీరంప్రాంతాల వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి. ఒడ్డున భద్రపరచిన తెప్పలు, ఇంజన్లు, వలల వరకు కెరటాలు దూసుకొస్తున్నాయి. మత్య్సకారులు తెలిపారు. రాజయ్యపేట, బోయపాడు, బంగారయ్యపేట, చినతీనార్ల, పెద తీనార్ల ప్రాంతాలలో ఆదివారం అలల తాకిడికి సముద్రతీరం కోతకు గురైందని వారు చెప్పారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో రెండురోజుల నుంచి మత్య్సకారులు వేటకు వెళ్లడం లేదు. వేటకు వెళ్లిన వారికి ఫోన్‌ ద్వారా తుపాను సమాచారం అందజేసి, వెనక్కిరప్పించారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనంటూ వారు ఆందోళన చెందుతున్నారు.

అప్రమత్తమైన అధికారులు

తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పాయకరావుపేట నియోజకవర్గంలోనే ఎక్కువ తీరప్రాంతం ఉంది. మూడు మండలాల్లో సుమారు 17 మత్య్సకార గ్రామాలు తీరప్రాంతాన్ని ఆనుకుని ఉన్నాయి. ఈ గ్రామాల్లో సుమారు 25 వేల మంది మత్య్సకారులు జీవిస్తున్నారు. దాదాపు 6వేలమంది తెప్పలు, బోట్లపై వేటకు వెళ్తుంటారు. ఈ క్రమంలో తీరప్రాంత గ్రామాల్లో నివసిస్తున్నవారిని ముందుగానే అప్రమత్తం చేసేందుకు అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. నర్సీపట్నం ఆర్డీవో జయరాం, మండల ప్రత్యేకాధికారి ప్రభాకర్‌రావు, తహసీల్దార్‌ అంబేడ్కర్‌ ఆదివారం రాజయ్యపేట, బోయపాడు, అమలాపురం తదితర గ్రామాల్లో పర్యటించారు. రక్షిత భవనాల వద్ద విద్యు త్‌, జనరేటర్‌ సదుపాయం, అవసరమైతే నిత్యావసర సరకులు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో కంట్రోలు రూం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

ఎస్‌.రాయవరం: మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని నర్సీపట్నం ఆర్డీవో జయరామ్‌ సూచించారు. మండలంలో మత్స్యకార గ్రామాలైన బంగారమ్మపాలెం, రేవుపోలవరం గ్రామాల్లో ఆదివారం ఆర్డీవో పర్యటించారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు పలు సూచనలు చేశారు. వర్షాలు తీవ్రత పెరిగితే లోతట్టు ప్రాంతాల వారిని ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్థానిక అధికారులకు సూచించారు. ఆయన వెంట స్థానిక తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఎస్‌ఐ ప్రసాద్‌రావు, వైస్‌ ఎంపీపీ చోడిపల్లి అప్పన్న, సర్పంచ్‌ మల్లే లోవరాజు, ఈవోపీఆర్డీ సత్యనారాయణ ఉన్నారు.

యలమంచిలిలో కోసిన వరిని దగ్గరుండి కుప్పలుగా వేయిస్తున్న వ్యవసాయ సిబ్బంది
1/5

యలమంచిలిలో కోసిన వరిని దగ్గరుండి కుప్పలుగా వేయిస్తున్న వ్యవసాయ సిబ్బంది

కోసిన వరి పనలను ఒబ్బిడి చేస్తున్న రైతు
2/5

కోసిన వరి పనలను ఒబ్బిడి చేస్తున్న రైతు

రేవుపోలవరంలో మత్స్యకారులతో
 మాట్లాడుతున్న ఆర్డీవో
3/5

రేవుపోలవరంలో మత్స్యకారులతో మాట్లాడుతున్న ఆర్డీవో

రాజయ్యపేట వద్ద కోతకు గురైన తీరం
4/5

రాజయ్యపేట వద్ద కోతకు గురైన తీరం

5/5

Advertisement
 

తప్పక చదవండి

Advertisement