
పెండింగ్ అర్జీలను పరిష్కరించండి
తుమ్మపాల: పీజీఆర్‌ఎస్ అర్జీలపై నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ఆమెతో పాటు జిల్లా రెవిన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, ఎస్డీసీ రమామణి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలపై క్షేత్రస్ధాయిలో విచారణ చేసి అర్జీదారులకు వివరించాలన్నారు. పరిష్కరించదగ్గ అర్జీలను తక్షణమే పూర్తి చేయాలన్నారు. డివిజను, మండల స్థాయిలో నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వచ్చిన ప్రతి అర్జీని ఆన్‌లైన్ చేసి, రశీదు అందించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.
నర్సాపురం పంచాయతీలో సమస్యలపై వినతి
చోడవరం మండలం నర్సాపురం గ్రామం ప్రత్యేక పంచాయతీగా ఉన్నప్పటికీ రాయపురాజుపేట రెవెన్యూ గ్రామంగానే కొనసాగడంతో రైతులు, విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని నర్సాపురం సర్పంచ్ అప్పారావు, ఎంపీటీసీ బి.లక్ష్మి, గ్రామపెద్దలు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. నర్సాపురం పంచాయతీ విభజన జరిగినా ఎటువంటి ప్రయోజనం జరగడం లేదని, నర్సాపురం గ్రామ సచివాలయం వెంకన్నపాలెంలోను, రెవెన్యూ పరిధి రాయపురాజుపేటలోను ఉండటంతో ప్రజలంతా ధ్రువీకరణ పత్రాలు విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామాల్లో విద్యార్థులకు అందించే పత్రాల్లో రాయపురాజుపేట గ్రామంగా నమోదవుతుందని, రైతుల భూములు కూడా రెవెన్యూ పరిధి మాదిరిగానే నమోదవ్వడం, సచివాలయ పరిధి వెంకన్నపాలెం కావడంతో ప్రభుత్వ పథకాలు కూడా సక్రమంగా అందడం లేదని, యూరియా పంపిణీలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని తెలిపారు. పూర్తిస్ధాయి పంచాయతీగా నర్సాపురం గ్రామాన్ని నిర్ధారించాలని కోరారు.
గురుకుల పాఠశాలలో సౌకర్యాలు కల్పించండి..
డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో అపారిశుధ్యం కారణంగా దోమలు, పాముల బెడద నుంచి విద్యార్థులను కాపాడాలని, మరమ్మతులు చేపట్టి నీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ దేవరపల్లి మండలం తెనుగుపూడి గ్రామంలో గల గురుకుల పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ ఇరట నరసింహమూర్తి పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. పాఠశాల నుంచి హైస్కూల్ వరకు సీసీ రోడ్డు వేయాలని, పాఠశాలలో కూడా మరమతులు చేపట్టి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు..
అక్రమ మద్యం అమ్మకాలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ వి.మాడుగుల మండలంలోని పలువురు సీపీఎం నాయకులు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో చిల్లర దుకాణాల నుంచి దాబాల వరకు అన్నింటా మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని, బాటిల్ ఎంఆర్‌పీ ధర కన్నా అదనంగా రూ.50 అదనంగా వసూలు చేస్తు ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారని తెలిపారు. కల్తీ మద్యంపై ఎటువంటి నిఘా లేదన్నారు. మద్యానికి యువత యవత బానిసలుగా మారడంతో ఘర్షణలు, హింస పెరిగిందన్నారు.
చీఫ్ జస్టిస్‌పై దాడి గర్హనీయం
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్.గవాయ్‌పై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు అరెస్టు చేయాలంటూ ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. దాడి వెనుక శక్తులను గుర్తించి శిక్షలు పడేవిధంగా స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఎంఆర్‌పీఎస్ జిల్లా కమిటీ అనకాపల్లి ఇన్‌చార్జి పి.వెంకటరమణ డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ పథకాలు అందడం లేదు..
సాగు భూములకు పట్టాలు ఉన్నప్పటికి రెవెన్యూ వెబెబ్‌ల్యాండ్‌లో రైతుల పేర్లతో ఆన్‌లైన్ చేయకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు పొందలేక పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వి.మాడుగుల మండలం ఒమ్మలి గ్రామానికి చెందిన కార్లె భవానీ రైతుల తరపున పీజీఆర్‌ఎస్‌లో అర్జీ దాఖలు చేశారు. వి.మాడుగుల, ఒమ్మలి, జగన్నాథపురం, కృష్ణాపురం, రావికమతం మండలంలో పలు గ్రామాల్లో ఊరలోవ, నాగళ్లకొండ, కొప్పుకొండమ్మ, అడ్డుకొండ ప్రాంతాల్లో 450 మంది రైతులను గుర్తించినప్పటికి ఎటువంటి ప్రక్రియ మొదలుపెట్టలేదని, వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎస్పీ కార్యాలయానికి 55 ఫిర్యాదులు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయానికి సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 55 అర్జీలు వచ్చాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు వారివారి సమస్యలను లిఖితపూర్వకంగా ఎస్పీ తుహిన్ సిన్హాకు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫి ర్యాదును నిశితంగా పరిశీలించి వాస్తవాలు నిర్ధారించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు–28, కుటుంబ కలహాలు–6, ఇతర విభాగాలకు చెందినవి–21 ఆర్జీలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, ఎస్‌ఐ శిరీష పాల్గొన్నారు.

పెండింగ్ అర్జీలను పరిష్కరించండి