
మునగపాక వాసికి ప్రతిష్టాత్మక పురస్కారం
మునగపాక: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే వారికి అవార్డులు వెతుక్కుంటూ వస్తాయని మునగపాకకు చెందిన శాంతారామ్ చాటి చెప్పారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీసు మెడల్ దక్కించుకొని ఎంతోమందికి ఆయన ఆదర్శంగా నిలిచారు. మునగపాకకు చెందిన పెంటకోట సత్యనారాయణ, సత్యవతి కుమారుడు శాంతారామ్. సత్యనారాయణ గతంలో ఎస్పీగా సేవలందించి రాష్ట్రపతి అవార్డును దక్కించుకున్నారు. సత్యనారాయణ కుమారుడు వెంకట శ్రీధర శాంతారామ్ ప్రస్తుతం కోల్‌కతాలోని ఆర్‌పీఎఫ్ విభాగంలో డీఐజీగా సేవలందిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయునిగా ఎంతో సమర్ధతతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శాంతారామ్ సేవలను గుర్తించిన రైల్వే ఉన్నతాధికారులు ఆయనను ఇండియన్ పోలీసు మెడల్‌కు ఎంపిక చేశారు. సోమవారం నిర్వహించిన ఆర్‌పీఎఫ్ డేలో భాగంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్ చేతుల మీదుగా మెడల్‌ను అందుకున్నారు. గుజరాత్‌లోని ఆర్‌పీఎఫ్ జోనల్ ట్రైనింగ్ కేంద్రంలో శాంతారామ్ పురస్కారాన్ని అందుకున్నారు.