
ప్రైవేటు క్లినిక్‌పై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు
రాంబిల్లి (అచ్యుతాపురం): వాడనర్సాపురంలో ఓ ప్రైవేటు క్లినిక్, మెడికల్ షాపుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ గ్రామస్తులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎటువంటి విద్యార్హతలు లేని ఆర్‌ఎంపీ వైద్యురాలిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు 4 వేల మంది వాడనర్సాపురం వాసులకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని, నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న మెడికల్ షాప్‌ని సీజ్ చేయాలని ఫిర్యాదులో కోరారు.
ప్రైవేటు వైద్యం వికటించి వ్యక్తి మృతి?
ప్రైవేట్ వైద్యం వికటించడంతో రాంబిల్లి మండలంలోని వాడనర్సాపురానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. అయితే దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయినప్పటికీ పోస్టుమార్టం రిపోర్టు వచ్చే వరకూ వాస్తవాలు తెలిసే అవకాశం లేదు. వాడనర్సాపురానికి చెందిన ఎం.కాశీ(46) ఈ నెల 4వ తేదీన జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ఒక మెడికల్ షాపునకు వెళ్లి మాత్రలు అడిగారు. దీనికి అక్కడ ఉన్న క్లినిక్ నడుపుతున్న నర్సు రెండు తొడలపై ఇంజక్షన్లు చేసింది. అయితే జ్వరం తగ్గకపోగా, తొడలపై ఇంజక్షన్లు చేసిన చోట వాపు వచ్చింది. పరిస్థితి విషమించడంతో కాశీ కుటుంబీకులు బాధితుడ్ని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 6న కాశీ మృతి చెందడంతో కుటుంబీకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సరైన కారణం తెలియని మరణంగా కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నారు. అవగాహన లేని వైద్యం వల్లే కాశీ మృతి చెందాడని అతని కుటుంబీకులు లబోదిబోమంటున్నారు. మృతుడు కాశీకి భార్య,ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. భార్య కమలకు వినికిడి లోపం. దీంతో ఆ కుటుంబ పరిస్థితి వీఽధిన పడింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, అవగాహన లేని వైద్యం అందిస్తూ రోగుల మృతికి కారణమవుతున్న ప్రైవేటు క్లినిక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్నారు.