వర్షాభావం | - | Sakshi
Sakshi News home page

వర్షాభావం

Sep 18 2026 1:03 AM | Updated on Sep 18 2026 1:03 AM

సెప్టెంబర్‌ త్వరలో ముగుసున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని ప్రధాన జోలాపుట్టు ప్రాజెక్ట్‌ జలకళ కోల్పోయింది. దీని ప్రభావం మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రం ఉత్పత్తిపై చూపనుంది. ఈ పరిస్థితుల్లో ఒకవైపు జనరేటర్ల మరమ్మతులు, మరోవైపు వర్షాభావ పరిస్థితులు అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
జోలాపుట్టుకు

విద్యుత్‌ ఉత్పత్తికి నీటికొరత

తలెత్తే అవకాశం

మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో రెండు జనరేటర్ల పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 34 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. త్వరలో మిగిలిన నాలుగు జనరేటర్లను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాం. ఈ ఏడాది వర్షభావ పరిస్థితుల వల్ల జోలాపుట్టు జలాశయంలో నీటి మట్టం తక్కువగా ఉంది. డుడుమ జలాశయంలో నీటిమట్టాన్ని పూర్తి స్థాయిలో ఉంచి విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగిస్తున్నాం. అధికంగా వర్షాలు కురిస్తేనే ఉత్పత్తికి ఎటువంటి సమస్య ఉండదు.

– సీహెచ్‌ అప్పాజీ, ఎస్‌ఈ,

మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం

ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరు అందించే ప్రధాన జోలాపుట్టు జలాశయంలో సెప్టెంబర్‌ నెల వచ్చినా జలకళ కరువైంది. ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో జలాశయాలలో నీటి కొరత ఏర్పడి, మాచ్‌ఖండ్‌లో విద్యుత్‌ ఉత్పత్తి చేసే అధికారులకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.

● జోలాపుట్టులోని ప్రధాన, స్పిల్‌వే జలాశయాల పూర్తి స్థాయి నీటి మట్టం 2,750 అడుగులు కాగా, బుధవారం నాటికి జోలాపుట్టు ప్రధాన జలాశయంలో 2,734.20 అడుగుల నీటి మట్టం నమోదైంది. ఇదే రోజు గత ఏడాది 2,748.25 అడుగుల నీటి నిల్వ ఉండేది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 14 అడుగుల నీటి నిల్వ తక్కువగా ఉంది.

● జోలాపుట్టు స్పిల్‌వే జలాశయం అడుగంటిపోయి కళావిహీనంగా మారింది. గత ఏడాది స్పిల్‌వే జలాశయంలో 2,738 అడుగుల నీరు ఉండగా, ఈ ఏడాది చుక్క నీరు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం.

డుడుమలో జలాశయంలో..

ఈ రెండు జలాశయాల నీటి మట్టంపై ఆధారపడి ఉన్న డుడుమ జలాశయంలో సైతం నీటి మట్టం ఆశించిన స్థాయిలో లేదు. డుడుమ జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 2,590 అడుగులు కాగా, ప్రస్తుతం 2,588.20 అడుగులుగా ఉంది. డుడుమ జలాశయంలో నీటి స్థాయి తగ్గకుండా చూసేందుకు గత కొన్ని రోజులుగా జోలాపుట్టు జలాశయం నుంచి నీటిని డుడుమకు విడుదల చేస్తున్నారు. మరో రెండు, మూడు వారాల్లో వర్షాలు కురవకపోతే, ఇప్పటికే అడుగంటిన జోలాపుట్టు స్పిల్‌వేతో పాటు ప్రధాన జలాశయంలో కూడా ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి నీరు కూడా ఆవిరైపోయే ప్రమాదం ఉంది.

విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రభావం

మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రంలో 6 జనరేటర్ల సహాయంతో 120 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన చేసే సామర్థ్యం ఉంది. అయితే, ఈ ఏడాది మే 23న ప్రాజెక్టులో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా నిలిచిపోయిన ఉత్పత్తి, రెండు నెలల తరువాత గత నెల నుంచి మళ్లీ ప్రారంభమైంది.

● ప్రస్తుతం ప్రాజెక్టులో రెండు జనరేటర్ల సహాయంతో 34 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. మరో 4 జనరేటర్ల మరమ్మతు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. అన్ని జనరేటర్లు వినియోగంలోకి వచ్చే నాటికి జలాశయాల్లో నీటి స్థాయి పెరగకపోతే, విద్యుత్‌ ఉత్పాదనకు తీవ్ర ఆటంకం కలగనుంది. ఎప్పుడు భారీ వర్షాలు కురుస్తాయా, జలాశయాలు ఎప్పుడు నిండుతాయా అని ఆంధ్ర–ఒడిశా జెన్‌కో అధికారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

అడుగంటిన మత్స్యగెడ్డ...

జోలాపుట్టు, డుడుమ జలాశయాల నీటి నిల్వలు ప్రధానంగా మత్స్యగెడ్డపైనే ఆధారపడి ఉంటాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మత్స్యగెడ్డ పూర్తిగా ఎండిపోయి కనిపిస్తోంది. మత్స్యగెడ్డ గిరిజన ప్రాంతంలోని ఎనిమిది మండలాలలో కురిసే వర్షపాతంపై ఆధారపడి ఉంటుంది.

● జి.మాడుగుల మొదలుకుని పాడేరు, హుకుంపేట, డుంబ్రిగూడ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలలో గత కొన్ని రోజులుగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో మత్స్యగెడ్డలోకి నీరు చేరలేదు. ఆయా మండలాల్లో భారీగా వర్షాలు కురిస్తేనే మత్స్యగెడ్డలోకి వరదనీరు వచ్చి, జోలాపుట్టు జలాశయంలోకి నీరు చేరుతుంది. దీనివల్ల మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి అవసరమైన నీటి సరఫరా సాధ్యమవుతుంది. భారీ వర్షాలు పడితే తప్ప మత్స్యగెడ్డలో నీరు చేరే అవకాశం లేకపోవడంతో, వర్షాలు కురిసే తీరును బట్టే మాచ్‌ఖండ్‌లో భవిష్యత్‌ విద్యుత్‌ ఉత్పత్తి ఆధారపడి ఉంటుందని ప్రాజెక్టు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సెప్టెంబర్‌ నెల గడుస్తున్నానిండని జలాశయం

నిరాశపరుస్తున్న మత్స్యగెడ్డ

మాచ్‌ఖండ్‌లో విద్యుత్‌ ఉత్పత్తికినీటిగండం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement