● రూ.5 కోట్లతో సుందరీకరణ
● అరకు ఎంపీ తనూజరాణి,ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ వెల్లడి
● జలపాతం సదర్శన
పెదబయలు: మారుమూల ప్రాంతంలోని ప్రకృతి సోయగాలకు మరింత వన్నె తెచ్చేలా తారాబు జలపాతం అభివృద్ధికి రూ. 5 కోట్ల ఎంపీ నిధులు కేటాయించినట్లు అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ వెల్లడించారు. గురువారం పెదబయలు మండలం గిన్నెలకోట, జామిగుడ పంచాయతీల మధ్యలో ఉన్న తారాబు జలపాతాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికలపై సంబంధిత ఇంజనీర్లతో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పర్యాటకుల సౌకర్యార్థం గ్లాస్ బ్రిడ్జ్ , టాయిలెట్లు, బట్టలు మార్చుకునే గదులు, లైటింగ్, పార్కింగ్, తాగునీటి సదుపాయం, విశ్రాంతి ప్రదేశాలు, వాచ్ టవర్, నడక మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, సూచిక బోర్డులు, చెత్త నిర్వహణ తదితర మౌలిక వసతుల కల్పన అంశాలను పరిశీలించినట్లు తెలిపారు.
సహజత్వాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధి
తారాబు జలపాతం సహజ అందాలకు ఎటువంటి భంగం కలగకుండా, పర్యాటకులకు అవసరమైన ఆధునిక సౌకర్యాలు కల్పించేలా సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఎంపీ కోరారు. పనులు త్వరతగతిన ప్రారంభించి నాణ్యతతో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెదబయలు మండలం మారుమూల జామిగుడ, గుంజివాడ గ్రామాల్లో పర్యటించిన అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణికి, పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మకు గ్రామస్తులు, స్థానిక నాయకులు గిరిజన సంప్రదాయ ప్రకారం పూలమాలలు వేసి,హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులు పనిచేసినప్పటికీ, తమ మారుమూల గ్రామాల అభివృద్ధికి మీరే బాటలు వేశారని గ్రామస్తులు కొనియాడారు. తారాబు జలపాతానికి ఆధునిక సదుపాయాలు కల్పించి ఇక్కడి అందాలను ప్రపంచానికి చాటేందుకు రూ. 5 కోట్ల ఎంపీ నిధులు కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రూడకోట నుంచి జామిగుడ వరకు రూ. 15 కోట్లతో తారురోడ్డు నిర్మాణం జరిగిందని, రూ. 2 కోట్లతో జామిగుడ వంతెనకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. తారాబు జలపాతం అభివృద్ధి చెందితే స్థానికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తారాబు జలపాతం అందాలు అద్భుతమని, తగిన సదుపాయాలు కల్పిస్తే ఇది రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందుతుందని ఎంపీ అన్నారు. ఈ సందర్భంగా జలపాతం వద్ద ఎంపీ, అధికారులు స్థానికులతో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, మాజీ ఎంపీపీ జర్సింగి సూర్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన నాయకులు చెట్టి వినయ్, పెదబయలు జెడ్పీటీసి కూడ బొంజుబాబు, సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ జర్సింగి బాలంనాయుడు, గంపరాయి సూరయ్య, వైస్ ఎంపీపీ రాజుబాబు, మాజీ జెడ్పీటీసి జర్సింగి గంగాభవాని, ఎంపీటీసి వంతాల ఆనందరావు, ఒంటుబు సామ్యూల్, పాంగి సింహాచలం, కాతారి సురేశ్‌కుమార్, చెండా పాపారావు, రవిశంకర్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.


