కలెక్టర్ నిశాంతి
సాక్షి, పాడేరు: వాస్తు, శిల్పం, నిర్మాణ రంగాల రూపకర్త విశ్వకర్మ జయంతిని గురువారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి కలెక్టర్ డి.నిశాంతి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శిల్పకళ, వాస్తు, నిర్మాణ నైపుణ్యాలను అందించిన మహనీయుడు విశ్వకర్మ అని, నేటి యువతంతా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సంప్రదాయ వృత్తి నైపుణ్యాలను పరిరక్షించడంతో పాటు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. విశ్వకర్మ చిత్రపటానికి డీఆర్‌వో లోకేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, విశ్వబ్రహ్మణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ జీవిత విశేషాలను డీఆర్వో సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులతో పాటు పాడేరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ధర్మకర్త నవర గోవిందరావు, విశ్వబ్రహ్మణులు పాల్గొన్నారు.
ఘనంగా ఊరేగింపు : విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించారు. సాయంత్రం పాడేరు పురవీధుల్లో విశ్వకర్మ చిత్రపటాన్ని పల్లకిలో ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ సంఘం నేతలు సున్నం సత్యనారాయణ, దిమిలి రమణ, వెంకటరమణ, శ్రీశైలపు నానాజీ, మొగలతుత్తి శ్రీను, మునసాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.


