పెదబయలు: మండలంలోని మారుమూల పంచాయతీల్లో పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ ఆదేశించారు. గురువారం ఆయన మండలంలోని మారుమూల జామిగుడ, గిన్నెలకోట పంచాయతీల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీఎం జన్‌మన్ పథకం ద్వారా జరుగుతున్న పనులు, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల భవనాలు, రహదారుల పెండింగ్ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్, పీఐయూ విభాగాలకు చెందిన పెండింగ్ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో మాట్లాడి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ముంచంగిపుట్టు మండలం పూలబంధ, తాడిపుట్టు, భూషిపుట్టు గ్రామాల్లో పర్యటించి స్థానిక ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామాల్లో తాగునీరు, రహదారులు, గృహ నిర్మాణ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, పెండింగ్‌లో ఉన్న అన్ని నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పీవో హామీ ఇచ్చారు.
ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశం


