కొయ్యూరు: గంజాయి సాగు నిర్థారణ కోసం గురువారం మంప ఎస్‌ఐ సీదరి శ్రీనివాస్ డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని అన్నవరం, కన్నవరం, గరిమండ, కిన్నెర్లబంధ, గొర్లెమెట్ట గ్రామాల్లో డ్రోన్ ఉపయోగించి ఈ సర్వే చేపట్టారు. గతంలో ఈ గ్రామాల్లో గంజాయి సాగు చేసేవారు కాగా, నాలుగేళ్ల కిందట పోలీసులు గంజాయి తోటలను ధ్వంసం చేసి హెచ్చరించడంతో గిరిజనులంతా సాగును పూర్తిగా నిలిపివేశారు. తాజాగా ఈ ఐదు గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో ఎక్కడా గంజాయి సాగు చేయడం లేదని స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. గంజాయికి బదులుగా గిరిజనులు కాఫీ, రాజ్‌మా, తీపి మొక్కజొన్న తదితర లాభసాటి వాణిజ్య పంటలను సాగు చేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. గంజాయి సాగవుతుందో లేదో పరిశీలించేందుకు డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే చేపట్టామని, ఎక్కడా గంజాయి సాగు లేదని తెలిపారు. గిరిజన రైతులు ప్రత్యామ్నాయంగా మంచి లాభాలు వచ్చే వాణిజ్య పంటలు వేస్తుండడం అభినందనీయమన్నారు.


