తుమ్మపాల : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించి సామాజిక న్యాయం కల్పించాలని జిల్లా యాత సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంకే మారేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, 139 కులాలకు చెందిన బీసీ రిజర్వేషన్లు కేవలం 10 శాతం ఉన్నత బీసీ కులాలకు చెందిన వారే రాజకీయ లబ్ధి పొందుతున్నారని అన్నారు. న్యాయవాది ఐఆర్ గంగాధర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించాలన్నారు. జిల్లాప్రధాన కార్యదర్శి గుత్తుర్తి అప్పారావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఎంబీసీలకు రాజకీయ ప్రాధాన్యం లేక పోవడం వల్ల ధనిక వర్గాలకు చెందిన రాజకీయ నాయకులు బానిసలుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ రిజర్వేషన్లు కొందరికే కాదని అందరికీ చెందాలని రాంబిల్లి మండల యాత సంక్షేమ సంఘం అధ్యక్షుడు రంగాల నాగరాజు అన్నారు. సీపీఐ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి జనార్ధన్ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం ఎంబీసీలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి తమ పార్టీ మద్దతిస్తుందని అన్నారు. ఐలాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ఎస్.అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎంబీసీల సామాజిక న్యాయ పోరాటం న్యాయబద్ధమైనదని అన్నారు. ఎంబీసీల న్యాయమైన రాజకీయ డిమాండ్ ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చి, ఎస్సీలకు అందించే అన్ని సంక్షేమ పథకాలు, సౌకర్యాలు అందించాలని కోరుతూ కలెక్టరేట్లో డీఆర్వో సత్యనారాయణరావుకు జిల్లా నాయకులు వినతిపత్రం అందించారు. కులవృత్తి చేసుకుంటూ నేటికీ గ్రామాల్లో ఒకటి రెండు కుటుంబాలుగా ఉన్న తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని, తమకు కూడా ఎస్సీ హోదా కల్పించడం ద్వారా ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలు పొందగలమన్నారు. ప్రభుత్వం స్పందించి రజకులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సాధన కమిటీ కోకన్వీనర్ చల్లపల్లి రామ కోటేశ్వరరావు, అడ్డూర్ శంకర్, పొట్నూరు తిరుపతయ్య, సూదికొండ రమణ హనుమంతరావు, రజక సంఘ నాయకులు పాల్గొన్నారు.


