అంతులేని అడవి తల్లి ఒడిలో స్వేచ్ఛగా బతకాల్సిన ఆ గిరి పుత్రుల జీవితాల్లో విధిఎందుకింత దారుణంగా ఆడుకుంటోంది? మాట రాక, చూపు దక్కక, నడవలేక.. కన్నవారికి భారంగా మారామనే భావనతో నాలుగు గోడల మధ్యే నరకం అనుభవిస్తున్న ఆ పసిహృదయాల తప్పేంటి? పింఛన్ పొందే అర్హత ఉన్నా.. ‘సదరం’ సర్టిఫికేట్ అనే కాగితపు ముక్క లేక, మైదాన ప్రాంతాలకు రాలేక అడవిలోనే మగ్గిపోతున్నఆ అభాగ్యుల పరిస్థితి చూస్తే రాతి గుండె కూడా కరగాల్సిందే!
అభాగ్యుల
సీలేరు: ప్రపంచానికి దూరంగా, పచ్చని అరణ్యంలో స్వేచ్ఛగా బతకాల్సిన ఆ గిరి పుత్రుల జీవితాల్లో విధి దారుణంగా ఆడుకుంటోంది. కడుపున పుట్టిన చిన్నారుల భవిష్యత్తు అంధకార బంధురమవుతున్నా, వారి ఆవేదనను ఆలకించే నాథుడే కరువయ్యాడు. తోటి పిల్లలతో ఆడుకోవాలన్నా, బడికి వెళ్లాలన్నా పుట్టుకతో వచ్చిన అంగవైకల్యం వారిని ఇళ్లకే పరిమితం చేస్తోంది. విధి చేసిన గాయానికి తోడు అధికారుల నిర్లక్ష్యం తోడవడంతో, పింఛన్ పొందే అర్హత ఉన్నా ‘సదరం’ సర్టిఫికేట్ లేక పసిమొగ్గలు నరకం అనుభవిస్తున్నారు.
జీవితమంతా చీకటే...
గూడెంకొత్తవీధి మండలం, సీలేరు పంచాయతీ పరిధిలోని సరిహద్దు గ్రామం చంద్రుపల్లికి చెందిన కిలో పొదలం, పను దంపతుల దయనీయ స్థితి వర్ణనాతీతం. వీరి రెండో కుమారుడు జానకిరామ్ (18) పుట్టుకతోనే అంధుడు. మాటలు రావు, చెవులూ వినబడవు. కన్నతల్లిదండ్రుల రూపం ఎలా ఉంటుందో కూడా తెలియని స్థితి. గతంలో చలికాలంలో మంట కాగుతూ ప్రమాదవశాత్తు నిప్పుల్లో పడడంతో ఒక చెయ్యి పూర్తిగా కాలిపోయింది. 18 ఏళ్లుగా నాలుగు గోడల మధ్యే నరకం అనుభవిస్తున్న ఈ అభాగ్యుడికి నేటికీ పింఛన్ అందడం లేదు. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ తల్లిదండ్రులు కొడుకు అవస్థలు చూడలేక కన్నీరుమున్నీరవుతున్నారు.
ఎనిమిదేళ్లుగా ఎదురుచూపులు...
సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంప్‌కు చెందిన కిలో గణేష్ (13) తొమ్మిదేళ్ల కిందట జరిగిన ప్రమాదంలో కుడిచేయి కాలిపోయి వంకర తిరిగిపోయింది. తీవ్ర అంగవైకల్యంతో బాధపడుతున్న గణేష్, తోటి పిల్లల వద్ద అవమానాలు భరిస్తూనే చదువుకుంటున్నాడు. పింఛన్‌కు అర్హత ఉన్నప్పటికీ సదరం సర్టిఫికేట్ పొందేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరగలేక అధికారులు కరుణిస్తారని ఎదురుచూస్తున్నట్లు తండ్రి జగ్గు, తల్లి తిరుపతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనాథగా మారిన కుమారి కుటుంబం...
పార్వతీనగర్ గ్రామానికి చెందిన కుర్ర కుమారి అనే గిరిజన మహిళ పరిస్థితి మరింత దయనీయం. ఇటీవలే భర్త అసురు అనారోగ్యంతో కన్నుమూయడంతో ముగ్గురు పిల్లల భారం ఆమైపె పడింది. పెద్ద కుమారుడు అజయ్ (12) పుట్టుకతోనే మానసిక దివ్యాంగుడు. ఒక చెయ్యి కూడా సరిగా పనిచేయదు. బాబుకు పింఛన్ మంజూరు చేయాలని రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది.
సదరం సెంటిమెంట్... ఎవరికి శాపం?
సదరం సర్టిఫికేట్ కోసం విశాఖపట్నం లేదా పాడేరు వెళ్లాల్సి రావడంతో, ఆర్థిక స్థోమత లేక, ప్రత్యేక వాహనాలు సమకూర్చుకోలేక తల్లిదండ్రులు మైదాన ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు. ప్రభుత్వం, అధికారులు నిబంధనలను పక్కనపెట్టి మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక వైద్య బృందాలను మారుమూల గ్రామాలకు పంపి, నేరుగా సర్టిఫికేట్లు అందజేసి, ఈ అభాగ్యులకు పింఛన్లు మంజూరు చేయాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.
విధి వంచించిన గిరి పుత్రులు
అర్హత ఉన్నా అందని పింఛన్లు
గగనంగా సదరం ధ్రువపత్రం
మైదాన ప్రాంతానికి రాలేకఅడవిలోన నరకం
పట్టించుకోని పాలకులు
అధికారుల అలసత్వానికి సజీవ సాక్ష్యం


