పాడేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు అరకు పర్యటన వల్ల ప్రజాధనం దుర్వినియోగం కావడం తప్ప స్థానిక గిరిజనులకు ఒరిగేదేమీ లేదని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ధ్వజమెత్తారు. ఆదివారం పాడేరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణ, జీవో నంబర్ 3 పునరుద్ధరణ, మారికవలస గిరిజన గురుకులం కొనసాగింపు వంటి కీలక అంశాలపై ఏమాత్రం స్పష్టత ఇవ్వకుండా సీఎం బాబు గిరిజనులను మోసం చేసే ప్రయత్నం చేశారన్నారు. ‘ప్రజా వేదిక’ ద్వారా సీఎం వివిధ శాఖల నివేదికలను బహిర్గతం చేస్తూ అధికారులు సరిగా పనిచేయడం లేదని నిలదీయడం కేవలం గిరిజనుల మెప్పు కోసమేనని విమర్శించారు. కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో గిరిజన ప్రాంతాలకు ఏం అభివృద్ధి చేయలేదని, తమ ప్రభుత్వం విఫలమైందని సీఎం బాబు పరోక్షంగా ఒప్పుకున్నారన్నారు. ఏజెన్సీలో హౌసింగ్, మైనింగ్, ఉపాధి హామీ వంటి కీలక శాఖల నివేదికలను బహిర్గతం చేసేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేసిందో చెప్పాలన్నారు. ఆ శాఖల్లో అంతులేని అవినీతి, అక్రమాలు జరిగాయని, అవి బయటకు వస్తే అ డ్డంగా దొరికిపోతామనే భయంతోనే దాచిపెట్టారని ఆ రోపించారు. ఏజె న్సీ గ్రామాల్లో వీధి దీపాలు, రక్షిత మంచి నీరు, డ్రైనే జీ వ్యవస్థ అద్వాన్నంగా ఉన్నాయని, రెవెన్యూ సహా పలు శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోందని తాము మొదటి నుంచీ చెబుతున్న విషయమేనని, ఇప్పుడు సీఎం కొత్తగా తెలుసుకున్నట్లు నటిస్తున్నారన్నారు.
1/70 చట్టంపై మౌనమెందుకు?
గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు గిరిజనేతరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల తరఫున ఎందుకు ఇంప్లీడ్ పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు. ఈ అంశంపై సీఎం ఎందుకు నోరు విప్పలేదన్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే గిరిజన విద్యార్థులకు ఐఐటీ, నీట్, జేఈఈ శిక్షణ ఇప్పించామని.. ఇప్పుడు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ పేరుతో కొత్తగా వింతలు సృష్టిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఏజెన్సీలో కూటమి ఉనికి కాపాడుకోవడానికే ఈ పర్యటన అని బాలరాజు స్పష్టం చేశారు.
వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు,
మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు


