● నమోదు తప్పనిసరి
● జేసీ తిరుమణి శ్రీపూజ
పాడేరు: ఓటు హక్కు కలిగి ఉండటం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ (జేసీ) తిరుమణి శ్రీపూజ సూచించారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓటు హక్కు నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్లు పూర్తయిన పలువురు యువతీ యువకులకు జేసీ స్వయంగా దగ్గరుండి ఆన్‌లైన్‌లో ఓటు నమోదు ప్రక్రియ పూర్తి చేయించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. బాధ్యతగల యువత ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొంది, ఎన్నికల సమయంలో సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవడానికి తమ విలువైన ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఇంటి నుంచే నమోదు..
18 ఏళ్లు నిండిన యువత, విద్యార్థులు తమ మొబైల్‌లోని ప్లే స్టోర్ నుంచి ’ఓటర్ హెల్ప్‌లైన్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని లేదా ఓటర్స్.ఈసీఐ.జీవోవీ.ఇన్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇంటి వద్ద నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఫారమ్–6 తో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డ్ లేదా 10వ తరగతి సర్టిఫికేట్‌ను జతచేయాల్సి ఉంటుందన్నారు. అన్ని కళాశాలల్లో అర్హులైన విద్యార్థులందరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు బీఎల్వోలు, కళాశాల యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణమూర్తి, రెవెన్యూ ఆర్‌ఐ నల్లన్న, బిఎల్‌ఓలు రవికుమార్, లీలాప్రసాద్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


