అందని సదరం ధ్రువపత్రం
గూడెం కొత్తవీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ, పరమ సింగవరం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు రాజు ఐదేళ్ల వయసులోనే పోలియో బారినపడి మంచానికే పరిమితమయ్యాడు. ఈ అభాగ్యుడి దయనీయ స్థితిపై సాక్షిలో ప్రచురితమైన కథనానికి వైద్య శాఖ ఉన్నతాధికారులు (అమరావతి) తక్షణమే స్పందించారు. రాజుకు వెంటనే సదరం సర్టిఫికేట్ మంజూరు చేయాలని చింతపల్లి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఇదంతా జరిగి రోజులు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారలేదు. సదరం సర్టిఫికెట్ కోసం స్లాట్ బుకింగ్ చేయాలంటే బాధితుడు స్వయంగా సచివాలయానికి రావాలని అధికారులు చెబుతున్నారు. పరమ సింగవరం నుంచి బయటకు రావాలంటే బాధితుడిని డోలీపై మోస్తూ సుమారు 10 కిలోమీటర్ల మేర నడవాల్సిందే. ఈ దివ్యాంగ యువకుడిని అంత దూరం డోలీలో మోసుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇప్పటివరకు స్లాట్ బుకింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోకుండా, నిబంధనల పేరుతో కాలయాపన చేస్తుండటంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించినా క్షేత్రస్థాయి సిబ్బంది అలసత్వం వహించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపిస్తున్నారు. అధికారులు స్వయంగా గ్రామానికి వచ్చి లేదా ప్రత్యేక సదుపాయం కల్పించి రాజుకు సదరం సర్టిఫికేట్ అందేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.


