చింతపల్లి: పీఎం జన్‌మన్ పథకం కింద ఆదివాసీ గిరిజనులకు మంజూరైన పక్కా ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసుకోవాలని గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.బాబునాయక్ సూచించారు. ఆదివారం ఆయన ప్రత్యేక అధికారి శ్రీనివాసరావుతో కలిసి తాజంగి పంచాయతీలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా తాజంగిలో నూతనంగా నిర్మించనున్న ఇంటికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా జన్‌మన్ పథకం కింద మంజూరైన ఇళ్లలో ఇంకా 3,303 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదని తెలిపారు. ఆ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించగా, ఇప్పటివరకు 1,610 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయన్నారు. లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతా వివరాలను సచివాలయ కార్యాలయ సిబ్బందికి అందజేయాలని కోరారు. గృహ నిర్మాణాలకు సంబంధించి నిధుల కొరత ఏమాత్రం లేదని, నిర్మాణం పూర్తయిన దశలను బట్టి బిల్లుల చెల్లింపులు వెంటనే జరుగుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఈ అరుణకుమారి, వర్క్ ఇన్‌స్పెక్టర్ రమణబాబు, రాజారావు పాల్గొన్నారు.
గృహనిర్మాణ శాఖ పీడీ బాబునాయక్


