అనకాపల్లి: నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, పెంచిన ధరలను తగ్గించి బడుగు, బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బుగిడి నూకఅప్పారావు డిమాండ్ చేశారు. స్థానిక గవరపాలెం పార్కుసెంటర్ వద్ద నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మహిళలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు నెలల్లో 25 కిలోల బియ్యం ధర రూ.1,370 నుంచి ప్రస్తుతం రూ.1,770 పెరగడం దారుణమన్నారు. వంట నూనెలు, పప్పులు, అపరాలు, ఇతర కిరాణా సరుకుల ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో నిత్యావసరాల ధరలను తగ్గిస్తామని చెప్పిన కూటమి నాయకులు అధికారం చేపట్టిన తరువాత ధరలు విపరీతంగా పెరిగినా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. నిత్యావసర ధరలను తగ్గించే వరకూ పోరాటాలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళలు కాండ్రేగుల సన్నమ్మడు, బొడ్డేడ లక్ష్మి, భాగ్యలక్ష్మి, మాధవి, బి.సింహాచలం, కె.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


