కొయ్యూరు: దూరభారాన్ని దృష్టిలో ఉంచుకుని కొయ్యూరు మండలంలోని 12 పంచాయతీలకు సంబంధించిన టీకాల బాక్సులను అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేట ఆసుపత్రిలోనే నిల్వ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీజేపీ నేతలు శనివారం ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. జిల్లాలు వేరు కాకముందు రావణాపల్లి, అంతాడ, నల్లగొండ, బంగారంపేట, కినపర్తి, రత్నంపేట, పెదమాకవరం, నడింపాలెం, బట్టపనుకుల, శరభన్నపాలెం తదితర పంచాయతీలు కృష్ణాదేవిపేట ఆసుపత్రి పరిధిలో ఉండేవని తెలిపారు. ఆ ప్రాంతం దగ్గరగా ఉండటంతో వైద్య సిబ్బంది అక్కడే టీకాలను నిల్వ చేసుకుని తీసుకువెళ్లేవారన్నారు. అయితే, జిల్లాలు వేరైన తర్వాత ఈ 12 పంచాయతీలను రాజేంద్రపాలెం ఆసుపత్రిలో విలీనం చేయడంతో దూరం బాగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కృష్ణదేవిపేటలోనే టీకాలను నిల్వ చేసుకునేందుకు సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని నేతలు కోరారు. దీనిపై ఎస్టీ కమిషన్ చైర్మన్ స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మండల బీజేపీ అధ్యక్షుడు శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అరిమెల రాజు, జనజాతీయ సురక్ష మంచ్ రాష్ట్ర అధ్యక్షుడు డీవీడీ ప్రసాద్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.


