నక్కపల్లి: పాయకరావుపేట నియోజకవర్గంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నాలుగు మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీవ్రంగా నష్టపోతున్న రైతులను తక్షణమే ఆదుకోవడంతోపాటు వారి రుణాలను రీషెడ్యూల్ చేయాలని కోరారు. నక్కపల్లిలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంట ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ఎడమ కాలువ పనులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అప్పట్లోనే 50 శాతం కాలువ పనులు పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో మరో 25 శాతం పనులు జరిగాయన్నారు. పోలవరం ఎడమ కాలువకు వైఎస్సార్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. పశువులకు అవసరమైన పశుగ్రాసాన్ని ఉచితంగా లేదా సబ్సిడీపై ప్రభుత్వం అందించాలని కోరారు. పాయకరావుపేట నియోజకవర్గ రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు అయినంపూడి మాణిరాజు, గొర్ల గోవిందరావు, వెలగ ఈశ్వరరావు, సూరకాసుల గోవిందు, తల్లా భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి
వీసం రామకృష్ణ


