8లో
పాడేరు: విశాఖపట్నం జిల్లా మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను అక్కడే యథావిధిగా పునరుద్ధరించి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని, లేనిపక్షంలో గిరిజన సమాజంతో కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం పాడేరులోని తన క్యాంపు కార్యాలయంలో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనుజారాణి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ.. అల్లూరి జిల్లాలో ఎప్పుడూ వైఎస్సార్‌సీపీ హవానే ఉంటుందనే కక్షతో కూటమి ప్రభుత్వం, మంత్రి సంధ్యారాణి గిరిజన వర్గాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. తల్లిదండ్రులకు కనీస సమాచారం ఇవ్వకుండా, పోలీసులను అడ్డంపెట్టి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసి వేరే చోటుకు తరలించారని మండిపడ్డారు. విద్యార్థులు ఎక్కడ ఉన్నారో తల్లిదండ్రులకు అంతుబట్టడం లేదని, ఇలాంటి కక్షసాధింపు చర్యలకు గిరిజన సమాజం తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన మారికవలస విద్యాలయాన్ని విద్యా సంవత్సరం మధ్యలో, అకస్మాత్తుగా ఎత్తివేయడం దారుణమన్నారు. కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం ఈ దుర్మార్గానికి పాల్పడుతోందని ఆరోపించారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ.. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన ఈ గురుకులాన్ని అర్ధంతరంగా ఎత్తివేసే హక్కు కూటమి ప్రభుత్వానికి ఎవరిచ్చారన్నారు. నేడు అరకు వస్తున్న సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై స్పందించి, పాఠశాలను యథావిధిగా కొనసాగించేలా ప్రకటించకపోతే అందరినీ కలుపుకొని మహోద్యమం చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గిరిజనులు ప్రయోజకులు కాకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కుట్ర పన్నుతోందని విమర్శించారు. గిరిజన హక్కులు, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి భవిష్యత్‌లో పుట్టగతులు ఉండవని జోస్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, సలుగు ఎంపీటీసీ చిప్పాడ మీనా, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు గంగరాజు, మాజీ సర్పంచ్ పాంగి నాగరాజు పాల్గొన్నారు.
గిరిజన విద్యార్థుల జీవితాలతో కూటమి వ్యాపారం


