సీలేరు: మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ’ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ విజయపథంలో దూసుకుపోతోంది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో, ఇందులో షూటింగ్ జరుపుకున్న సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ ప్రాంతాలు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచాయి. దాదాపు 30 రోజుల పాటు సీలేరు, పొల్లూరు, డొంకరాయి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరగడంతో ఇక్కడి అందాలు తెరపై సరికొత్తగా ఆవిష్కృతమయ్యాయి. ’పుష్ప’ సినిమా తర్వాత ఆ స్థాయిలో సీలేరు అందాలు ఈ చిత్రంలో కనిపించడంతో యూట్యూబర్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు ఈ ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. సినిమాలోని సన్నివేశాలు చిత్రీకరించిన ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో షూట్ చేసి, చిత్రంలోని పాటలను జోడించి ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుండటంతో వాటికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. స్థానికులు సైతం ఆ వీడియోలను వాట్సాప్ స్టేటస్‌లుగా పెట్టుకుంటూ వైరల్ చేస్తున్నారు. సినిమా విడుదలైనప్పటి నుంచి పక్క రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రేక్షకులు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చి షూటింగ్ లొకేషన్లలో ఫొటోలు దిగుతున్నారు. గుంటవాడ జలాశయం, మారెమ్మ తల్లి ఆలయం, ఘాట్ రోడ్డు, సీలేరు మార్కెట్, ఇంటెక్స్ డ్యామ్, డొంకరాయి హైస్కూల్, పొల్లూరు జలపాతాలు పర్యాటక ప్రాంతాలుగా కళకళలాడుతున్నాయి.


