కొయ్యూరు: మండలంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యార్థి సాధన పరీక్ష (స్లాష్)ను జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి శశికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రాజేంద్రపాలెం బాలికల పాఠశాల, కొయ్యూరు ప్రభుత్వోన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల మరియు గంగవరం ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి పరీక్షా తీరును పర్యవేక్షించారు. తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులలో విద్యార్థుల అభ్యాసన స్థాయిలు, ప్రతిభ ఏ విధంగా ఉందనే అంశంపై ఈ పరీక్షను నిర్వహించారు. పారదర్శకత కోసం ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని మరో పాఠశాలకు పరిశీలకుడిగా (బ్లాక్ అబ్జర్వర్‌గా) నియమించారు. విద్యార్థుల సమాధాన పత్రాలను నేరుగా రాష్ట్ర రాజధానికి పంపి, అక్కడ మూల్యాంకనం (కరెక్షన్) చేసి ప్రతిభను నిర్ధారిస్తారు. ఈ పరీక్షల్లో తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కొయ్యూరు మండల పరిధిలోని మొత్తం 9 పాఠశాలల్లో ఈ పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్లు ఎంఈవో సింహాచలం.. ఏసీ శశికుమార్‌కు వివరించారు.


