● నక్కపల్లికి నీరు తరలింపునకు
నాతవరంలో రోడ్డు ధ్వంసం
● స్పీకర్, కలెక్టర్ భూమిపూజ చేసినచోటే వంగిన సిమెంట్ రోడ్డు
నాతవరం: కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్డు, తాగునీటి పైపులైనును కళ్ల ముందే పొక్లెయిన్‌తో ధ్వంసం చేస్తున్నా ఏమీ చేయలేని పరిస్ధితి నెలకొంది. మండలంలో నర్సీపట్నం – తుని మధ్య ఆర్‌అండ్‌బీ రోడ్డు, శృంగవరం నుంచి కాకినాడ జిల్లా సరిహద్దు వరకు తారురోడ్డు నిర్మాణంతోపాటు మధ్య వెదుళ్లుగెడ్డపై వంతెన నిర్మించేందుకు గత ప్రభుత్వం రూ. 14 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అప్పటి టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ తీవ్ర జాప్యం చేయడంతో ఎన్నికలు వచ్చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా రోడ్డు విస్తరణ పనులు చేసేందుకు 2024 నవంబరులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయకృష్ణన్ స్వయంగా భూమిపూజ చేశారు. శృంగవరం నుంచి జిల్లా సరిహద్దు వరకు తారురోడ్డు నిర్మించారు. రోడ్డు మధ్యలో వెదుళ్లుగెడ్డపై వంతెన ఇంకా నిర్మించలేదు. మన్యపురట్ల జంక్షన్ హెచ్‌పీసీఎల్ పాయింటు వద్ద అర్‌అండ్‌బీ రోడ్డు 300 మీటర్లు పల్లంగా ఉండడంతో అక్కడ తారురోడ్డుకు బదులు పటిష్టంగా ఉండేందుకు సిమెంట్ రోడ్డు నిర్మించారు.
కుంగిపోయిన రోడ్డు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నక్కపల్లి మండలంలో పలు పరిశ్రమలకు నీరు అవసరం నిమిత్తం ఏలేరు కాలువలో నీటిని తరలించేందుకు పైపులైను పనులు చేపట్టారు. నాతవరం మండలం ఎ.శరభవరం వద్ద ఏలేరు కాలువలో నీటిని పైపుల ద్వారా తరలించేందుకు ఆర్‌అండ్‌బీ రోడ్డు మార్జిన్ అనుకుని పొక్లెయిన్‌తో కాలువ తీస్తున్నారు. నాతవరం మండలం కాకినాడ జిల్లా కోటనందూరు తుని మండలాల మీదుగా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలానికి పైపులైను 60 కిలోమీటర్లు మేర కాలువ తీస్తున్నారు. ఆయా పనులు ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రూ.350 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు చేస్తున్నారు. ఇటీవల కొత్తగా వేసిన తారురోడ్డు, సిమెంట్ రోడ్డు మార్జిన్ లోతుగా తవ్వేయడంతో రోడ్డు బీటలు వేసి దెబ్బతింది. హెచ్‌పీసీఎల్ పాయింట్ వద్ద కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డు అడుగుభాగంలో పైపుల ఏర్పాటుకు లోతుగా తవ్వేయడంతో రోడ్డు కుంగిపోయింది. మిగతా ప్రాంతంలో తారురోడ్డు మార్జిన్‌లో లోతుగా తవ్వేసి పైపులు వేశాక మొక్కుబడిగా మట్టివేసి కప్పేయడంతో వర్షాలు వచ్చినపుడల్లా వాహనాలు కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ఫైలట్ ప్రాజక్టు ద్వారా 18 గ్రామాలకు తాగునీరు అందించేందుకు గతంలో తాండవ నదిలో సంపు నిర్మించి పైపులైను ద్వారా ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అప్పట్లో పైపులైను కోసం తారురోడ్డు మార్జిన్‌లో కాలువలు తీసి పైపులు వేశారు. ఆ పైపులు ఉన్న ప్రదేశం నుంచి నక్కపల్లి మండలానికి ఏలేరు కాలువలో నీటిని తరలించేందుకు పెద్ద కాలువలు తీస్తున్నారు. కాలువ తీసేటప్పుడు తాగునీటి పైపులైను ధ్వంసం కావడంతో ప్రజలకు తాగునీటి సరఫరాకు తరుచూ అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల ప్రజలకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల మధ్య నీటి కోసం వివాదం జరుగుతుంది. కళ్లముందే సిమెంట్ రోడ్డు కుంగిపోయినా, తారురోడ్డు శిథిలమైనా తాగునీటి పైపులైను ధ్వంసం చేసినా పెద్ద ప్రాజెక్టు పనులు కావడంతో సంబంధిత శాఖ అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
స్పీకర్ ఆదేశాలు బేఖాతర్
స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈనెల 11న నాతవరం నుంచి తాండవ మధ్య కొత్తగా నిర్మించిన తారురోడ్డు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ రోజు ఆయన మాట్లాడుతూ తారురోడ్డుపై దమ్ము ట్రాక్టర్లు తిరిగినా, రోడ్డును పాడు చేసినా వెంటనే కేసులు పెట్టాలని పోలీసులు, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. తమ పార్టీకి చెందిన దమ్ము ట్రాక్టర్లు రోడ్డుపై తిరిగినా కేసు పెట్టాలన్నారు. చమ్మచింత వద్ద పొలాలకు సాగునీరు కోసం తాండవ రోడ్డు మార్జిన్‌ను దొరబాబు తవ్వడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇపుడు నర్సీపట్నం – తుని మధ్య ఆర్‌అండ్‌బీ రోడ్డు మార్జిన్ తవ్వేయడంతో రోడ్డు కుంగిపోయి బీటలు వేస్తున్నా అధికారులు పట్టనట్టు ఉండిపోయారని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఆర్‌అండ్‌బీ జేఈ నాయుడుబాబును సంప్రదించగా శిథిలమైన రోడ్డు మరలా వారితోనే బాగు చేయించుతామన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ జయరాం మాట్లాడుతూ పైపులైను ఇష్టం వచ్చినట్టు తవ్వేయడంతో తరుచూ తాగునీటికి అంతరాయం ఏర్పడుతుందన్నారు. తమ సిబ్బంది వాటిని బాగుచేయడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.


