పాడేరు: గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం వ్యాపారం చేయాలని చూస్తోందని.. స్వలాభం కోసం ప్రైవేటు విద్యాసంస్థలకు అప్పగించేందుకే ఎంతో చరిత్ర కలిగిన మారికవలస గిరిజన గురుకుల విద్యాలయాన్ని అర్ధంతరంగా ఎత్తివేశారని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి మండిపడ్డారు. ఐటీడీఏ వద్ద గత మూడు రోజులుగా ఏకధాటిగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనకు శుక్రవారం ఆమె హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమను తరలించే ప్రక్రియలో అధికారులు, పోలీసులు వ్యవహరించిన తీరును, బెదిరింపులను ఎంపీకి వివరించి కన్నీటిపర్యంతమయ్యారు. వారిని ఓదార్చిన ఎంపీ మాట్లాడుతూ.. ’సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ పేరుతో గిరిజన విద్యార్థులను ఇతర పాఠశాలలకు ఆకస్మికంగా తరలించే హక్కు ఎవరిచ్చ??ంటూ ప్రశ్నించారు. విద్యాసంస్థలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యనందించాల్సింది పోయి, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. మారికవలస విద్యాలయాన్ని యథావిధిగా కొనసాగించాలని, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు వేరే భవనాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆమె జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలతో ఫోన్‌లో మాట్లాడి మారికవలస పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. అభంశుభం తెలియని అమాయక గిరిజన విద్యార్థులను పోలీసుల చేత భయభ్రాంతులకు గురిచేసిన అధికారుల తీరును జాతీయ బాలల హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, పార్టీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు శ్యాముల్, జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి కొమ్మ అనంత పద్మనాభం, పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


