యలమంచిలి రూరల్: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యలమంచిలిలో శుక్రవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తెలంగాణ, రాజస్తాన్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు అమలు చేస్తున్నాయని, మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించిన చట్టం చేయాలని వారంతా కోరారు. స్థానిక న్యాయస్థానాల ప్రాంగణం ఎదుట నిర్వహించిన ఈ నిరసనలో పాల్గొన్న న్యాయవాదులు మాట్లాడుతూ తమ డిమాండ్ సాధన కోసం వచ్చే సోమవారం కూడా విధులు బహిష్కరించనున్నట్టు తెలిపారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేయాలని నినాదాలు చేశారు. స్థానిక న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కొన్ని సివిల్ కేసులకు సంబంధించి పోలీసు,రెవెన్యూ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఆసరాగా చేసుకుని పాల్పడుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు తీర్మానించారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదుల ద్వారా సమాంతర కేసులు నడుపుతున్నారని పోలీసు,రెవెన్యూ అధికారులపై న్యాయవాదులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇకపై అలాంటి అక్రమాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.యలమంచిలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షుడు పి.వి. రమణ,కూనిశెట్టి శ్రీను,నగిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


