కలెక్టర్ నిశాంతి హెచ్చరిక
పాడేరు: గిరిజనులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టి. నిశాంతి అధికారులను హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో వైద్యశాఖ అధికారులతో ఆమె ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మలేరియా జ్వరాలను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రభావిత గ్రామాల్లో దోమతెరల పంపిణీని వేగవంతం చేయాలని మలేరియా విభాగం అధికారులను ఆదేశించారు. రోగులు, గర్భిణులను డోలీలలో మోస్తున్న సంఘటనలపై పత్రికల్లో వచ్చిన వార్తలపై ఆమె స్పందిస్తూ, సంబంధిత వైద్య బృందాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. జిల్లాలో మాతాశిశు మరణాల రేటును తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.జిల్లా ఆసుపత్రిలో ఫిజియోథెరపీ యూనిట్‌ను, అరకులోయలో బ్లడ్ బ్యాంక్ సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఐటీడీఏ గ్యారేజీలో మరమ్మతులకు గురై నిలిచిపోయిన అంబులెన్స్‌లను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ టి. నరసింగరావు, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
ఈ–ఆఫీస్ విధానంతోనే పారదర్శక సేవలు
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీస్ విధానం ద్వారానే ప్రజలకు పారదర్శకమైన పౌర సేవలు అందించాలని కలెక్టర్ టి. నిశాంతి ఆదేశించారు. కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులు, ఉద్యోగులకు ఈ–ఆఫీస్ సేవలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని శాఖల పనితీరును వంద శాతం మెరుగుపరిచేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని పేర్కొన్నారు. అధికార యంత్రాంగం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రజలకు వేగంగా సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఇన్ఫర్మాటిక్స్ అధికారి కె. శ్రీదేవి, టెక్నికల్ అసిస్టెంట్లు ఎస్.కె. సలీం, ఎస్. రాజు మరియు పలు విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.


