అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ సంపదను మట్టిపాలు చేస్తోంది. కొయ్యూరులోని ఐటీడీఏ కాలనీ కలప డిపోలో సుమారు రూ. కోటి విలువైన యూకలిప్టస్ కలప వేలం వేయకుండా వదిలేయడంతో, అది నేలపాలై కుళ్లిపోతోంది. అటవీ శాఖకు కాసుల వర్షం కురిపించాల్సిన వృక్షాలు నేడు అధికారుల ఉదాసీనత వల్ల అక్రమార్కుల పాలవుతున్నాయి.
పాడవుతున్న యూకలిప్టస్ చెట్ల కలప
కొయ్యూరు: అటవీ శాఖ అధికారుల ఉదాసీనత వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతోంది. స్థానిక ఐటీడీఏ కాలనీలో ఏర్పాటు చేసిన అటవీ శాఖ కలప డిపోలో సుమారు రూ. కోటి విలువైన యూకలిప్టస్ చెట్లు సరైన సంరక్షణ లేక మట్టిపాలవుతున్నాయి. సకాలంలో వేలం వేయకపోవడం వల్ల ఏపుగా పెరిగిన ఈ వృక్షాలు నేలకొరుగుతూ, అటవీ శాఖకు రావాల్సిన భారీ ఆదాయం వృథా అవుతోంది.
● 1985లో ఐటీడీఏ కాలనీలో నర్సరీ ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం అటవీ శాఖకు ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. ఆ సమయంలో అక్కడ పెద్ద ఎత్తున యూకలిప్టస్ మొక్కలను నాటారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తుండటంతో అప్పట్లో రైతులు కూడా వీటి సాగుపై ఆసక్తి చూపేవారు. అయితే, సుమారు 40 ఏళ్లు గడుస్తున్నా అటవీ శాఖ ఈ చెట్ల నరికివేతపై గానీ, విక్రయంపై గానీ దృష్టి సారించలేదు.
ప్రమాదకరంగా మారిన వృక్షాలు
ప్రస్తుతం ఈ చెట్లు ముదిరిపోయి, వేర్ల పటుత్వం కోల్పోయాయి. చిన్నపాటి ఈదురు గాలులు వీచినా ఇవి విరిగి పడిపోతున్నాయి. గతంలో ఇక్కడ సుమారు 250 చెట్లు ఉండగా, ఇప్పటికే వందకు పైగా చెట్లు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం మరో 150కి పైగా భారీ వృక్షాలు పడిపోయే స్థితిలో ఉన్నాయి.
క్షీణిస్తున్న నాణ్యత
రెండేళ్ల క్రితం ఇక్కడ అటవీ శాఖ కలప డిపోను ఏర్పాటు చేసినప్పటికీ, పడిపోయిన చెట్లను తరలించడం, వేలం వేయడంలో గానీ అధికారులు చొరవ చూపడం లేదు. ఎండకు ఎండి, వానకు తడిసి ఈ కలప నాణ్యత కోల్పోయి పాడైపోతోంది. సరైన రక్షణ లేకపోవడంతో పడిపోయిన కలపను కొందరు అక్రమంగా తరలిస్తుండగా, మిగిలినది మట్టిలో కలిసిపోతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో యూకలిప్టస్ కలపకు మంచి డిమాండ్ ఉంది. వీటిని బహిరంగ వేలం వేసినా లేదా నేరుగా వ్యాపారులకు విక్రయించినా ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో ఆదాయం సమకూరుతుంది.
● ముదిరిపోయిన ఈ చెట్ల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే ఈ కలపను వేలం వేయాలని, తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. నిర్లక్ష్యం వీడకపోతే రూ.కోట్లు విలువైన ప్రభుత్వ సంపద పూర్తిగా బూడిదలో పోసిన పన్నీరుగా మారే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.
ముదిరిపోయిన యూకలిప్టస్ తోటలు


