సీలేరు: కొండల మధ్య, జలాశయపు అలల చెంత కొలువైన మహిమాన్విత శ్రీ మారెమ్మ అమ్మవారిపై రూపొందించిన గానామృతం ఆడియో సీడీని గురువారం ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. జెన్‌కో చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు ఈ సీడీని విడుదల చేశారు. సీలేరు గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు భాను ప్రకాష్ అమ్మవారిపై భక్తితో ఈ గీతాలను రచించి, చిత్రీకరించారు. ఈ సందర్భంగా సీఈ రాజారావు మాట్లాడుతూ 1950వ సంవత్సరానికి పూర్వం ఇక్కడ జల విద్యుత్ కేంద్రాల నిర్మాణ సమయంలో తమిళనాడు నుంచి వచ్చిన కూలీలు ఈ మారెమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించారన్నారు. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాంతంలోని జల విద్యుత్ కేంద్రాల్లో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ రాష్ట్రమంతటా వెలుగులు నిండుతున్నాయంటే అది ఆ తల్లి దయ వల్లేనని ఆయన కొనియాడారు.తక్కువ సమయంలోనే అమ్మవారి మహిమను గుర్తించి, అష్టోత్తర శతనామవళి శ్లోకంతో పాటు ఐదు పాటలను అద్భుతంగా రచించిన ఉపాధ్యాయుడు భాను ప్రకాష్‌ను ఆయన అభినందించారు. ఇటువంటి ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సీడీని ఆవిష్కరించిన అనంతరం రచయిత భాను ప్రకాష్‌ను ముఖ్య అతిథులు దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎస్‌ఈ సీతారాం, సీలేరు ఎస్‌ఐ యాసిన్, ఈఈలు అప్పలనాయుడు, బాలసుబ్రహ్మణ్యం, బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, జయపాల్, సురేష్ పాల్గొన్నారు.


