పండగ తేదీల మార్పు సరికాదు | - | Sakshi
Sakshi News home page

పండగ తేదీల మార్పు సరికాదు

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర హితవు

ముంచంగిపుట్టు: గిరిజనుల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ తల్లి పండుగ తేదీలను మార్చడం సరికాదని, గిరిజన పండుగల్లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి రాజకీయం చేయడం మానుకోవాలని ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర హితవు పలికారు. బుధవారం పాడేరులో అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి సమక్షంలో పండుగ తేదీలను మార్చడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏటా మే 12న మోదకొండమ్మ తల్లి జన్మదినం కావడంతో, ఆ తేదీని కలిపి పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌, సభ్యులు, గిరిజన పెద్దలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులంతా కలిసి రెండు నెలల క్రితమే పండుగ తేదీలను ఖరారు చేశారన్నారు. పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాటను కూడా పరిగణనలోకి తీసుకోకుండా, గిరిజనుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి ప్రవర్తించడం సరికాదన్నారు. పండగల్లో తనకిష్టమొచ్చినట్లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌, అరకు ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేలను సంప్రదించకుండానే పండగను మే 17, 18, 19 తేదీలకు మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. మే 13న పాడేరులో ఒక టీడీపీ నేత వివాహం ఉండటం వల్లే ఈ తేదీలను మార్చారని ఆమె ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజన సంప్రదాయాలను పక్కన పెట్టకూడదని, ముందుగా ప్రకటించిన తేదీల్లోనే మోదకొండమ్మ తల్లి పండుగను నిర్వహించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement