తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల భక్తుల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మతల్లి పండగపై కూటమి ప్రభుత్వం, గిరిజనసంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి రాజకీయాలు చేయడం తగదని పాడేరు ఎమ్మెల్యే, మోదకొండమ్మతల్లి ఉత్సవ,ఆలయ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ లక్షలాది భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసేలా కూటమి ప్రభుత్వం మోదమ్మ పండగను రాజకీయం చేయడం సమంజసం కాదన్నారు. రాజకీయ ప్రయోజనాలు, ఎవరికో లబ్ధి చేకూర్చేందుకు మోదమ్మ ఉత్సవాల తేదీలు మార్చడం అన్యాయమన్నారు. ఉత్సవాల పందిరి రాట ప్రతిష్టించిన తరువాత ఉత్సవాల తేదీలు మార్చడం మంచి పద్ధతి కాదని, ఇలాంటి తప్పుడు విధానాలకు పాల్పడుతున్న కూటమి పెద్దలకు అమ్మవారే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మే 12వ తేదీన మోదకొండమ్మతల్లి పుట్టినరోజు వేడుకను మాత్రమే ఆలయ, ఉత్సవ కమిటీలు ఘనంగా జరుపుతాయన్నారు. ఉత్సవాలు మార్పు చేసిన మే 17,18,19 తేదీల్లో జరిగే మోదకొండమ్మతల్లి జాతరకు ఉత్సవ, ఆలయ కమిటీలకు ఎలాంటి సంబంధం లేదని, ఖర్చు మొత్తం కూటమి ప్రభుత్వమే బరాయించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.


