పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలకు ముహూర్తపు రాట వేశాక తేదీలు మార్పు మే17,18,19కు ఏకపక్షంగా మార్చిన గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి
● చంద్రబాబు ప్రభుత్వ తీరుపై భక్తుల ఆగ్రహం
● అమ్మవారే బుద్ధి చెబుతారు: ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు హెచ్చరిక
మన్యం ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ తల్లి ఉత్సవాల నిర్వహణ వివాదాస్పదంగా మారింది. దశాబ్దాల తరబడి వస్తున్న సంప్రదాయాలను పక్కనబెట్టి, కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ఉత్సవాల తేదీలను మార్చడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పందిరి రాట వేసి ముహూర్తం ఖరారైన తర్వాత, మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఏకపక్షంగా తేదీలను మార్చడంపై గిరిజన ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, పాడేరు: గిరిజనుల ఆరాధ్య దైవం, మన్యం ఇలవేల్పు పాడేరు మోదకొండమ్మ తల్లి ఉత్సవాల చుట్టూ కూటమి ప్రభుత్వం మురికి రాజకీయం చేస్తోంది. 40 ఏళ్ల పండగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వ పెద్దలు ఉత్సవాల తేదీలను మార్చడంపై భక్తులు, గిరిజన శ్రేణులు నిప్పులు చెరుగుతున్నారు.
ముహూర్తం ఖరారై.. పందిరి రాట వేసినా మార్పులా?
ఈ ఏడాది మోదకొండమ్మ తల్లి ఉత్సవాలను మే 10, 11, 12 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించాలని పాడేరు ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలంతా గత నెలలోనే ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ మేరకు ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ఉత్సవాల ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. శాస్త్రోక్తంగా పందిరి రాట కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. వివిధ సేవల కోసం కమిటీ ఇప్పటికే అడ్వాన్సులు కూడా చెల్లించింది. ఇంత జరుగుతున్నా, అవేవీ పట్టించుకోకుండా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఇతర టీడీపీ నేతలు తమ రాజకీయ పంతం కోసం తేదీలను మే 17,18,19వ తేదీలకు మారుస్తున్నట్లు ఏకపక్షంగా ప్రకటించడం కలకలం రేపింది.
మంత్రి తీరుపై ఎమ్మెల్యే ధ్వజం.. సమావేశం నుంచి వాకౌట్!
కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి సంధ్యారాణి నిర్ణయాన్ని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తీవ్రంగా ఖండించారు. భక్తుల నమ్మకాలతో రాజకీయం చేయడం దారుణమని మంత్రితో పాటు అధికారులను నిలదీశారు. లక్షలాది భక్తుల సెంటిమెంట్ కంటే మీకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా? పందిరి రాట వేసిన తర్వాత ముహూర్తాలు మార్చడం అరిష్టం. ఈ అపచారానికి పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి ఆ అమ్మవారే తగిన గుణపాఠం చెబుతుంది.. అని హెచ్చరిస్తూ ఆయన సమావేశం నుంచి బయటకు వచ్చేశారు.
భక్తుల మనోభావాలతో ఆటలా?
మేడారం జాతర తరువాత జాతీయ స్థాయిలో అంతటి గుర్తింపు ఉన్న మోదమ్మ జాతరపై కూటమి ప్రభుత్వం పెత్తనం చెలాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గ్రామ పెద్దల నిర్ణయానికే విలువ ఇచ్చేవారని, కానీ ఇప్పుడు మంత్రి తన ఇష్టానుసారం తేదీలు మార్చడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు.


