సీలేరు: అమ్మలగన్న అమ్మ, ముక్కోటి దేవతల మూలశక్తి, ఆపద మొక్కుల తల్లి శ్రీ మారెమ్మ అమ్మవారి 54వ వార్షిక జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా బుధవారం నాటి అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం భక్తుల జయజయధ్వానాల మధ్య ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది.
పవిత్ర అభిషేకాలు..విశేష పూజలు
ఉత్సవాల్లో భాగంగా తొలుత విశాఖపట్నానికి చెందిన కె. నాగరాజు, విజయ దంపతులు తమ మొక్కుబడిని చెల్లించుకుంటూ పంచామృతాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయ అర్చకులు దామోదర శర్మ పర్యవేక్షణలో, తమిళ అర్చకులు సుబ్రహ్మణ్యం వేదమంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో తల్లిని నేత్రపర్వంగా అలంకరించారు.
అగ్నిగుండ ప్రవేశం.. గరగ ప్రతిష్ట
స్నానాల ఘాట్ వద్ద అత్యంత భక్తితో అలంకరించిన మారెమ్మ అమ్మవారి గరగను ఊరేగింపుగా తీసుకువచ్చారు. మండుతున్న అగ్నిగుండం మీదుగా తల్లి గరగను తీసుకువెళ్లి గర్భాలయంలో ప్రతిష్టించడంతో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు 120 మంది మాలధారులు భక్తిప్రపత్తులతో అగ్నిగుండం ప్రవేశం చేశారు. బాణసంచా వెలుగులు, విద్యుత్ దీపాల అలంకరణల మధ్య సీలేరు గ్రామం ఆధ్యాత్మిక చైతన్యంతో పులకించిపోయింది.ఈ మహత్తర దృశ్యాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విశాఖ పోలీస్ శాఖకు చెందిన కె. నాగరాజు కుటుంబం ఈ పండుగలో ధ్వజం (జెండా), అగ్నిగుండం, ప్రధాన అన్నదాన కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించింది. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, పెద్ద ఎత్తున మహిళా భక్తులు ఈ వేడుకలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు.
ఆధ్యాత్మిక శోభతో విలసిల్లిన సీలేరు


