మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శ
చింతపల్లి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేశారని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం గిరిజనులు తమకు ఓటు వేయలేదన్న కక్షతో అభివృద్ధిని అడ్డుకుంటోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. చింతపల్లి గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ పండగ సందర్భంగా అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం తాజా మాజీ సర్పంచ్ పుష్పలత ఆధ్వర్యంలో చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజనులకు పరిపాలనను చేరువ చేసేందుకు, జిల్లా స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు అల్లూరి సీతారామరాజు పేరిట పాడేరును జిల్లా కేంద్రంగా జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. బాకై ్సట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం, అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 97ను రద్దు చేసి గిరిజన ప్రయోజనాలను కాపాడామన్నారు.ఏడు దశాబ్దాలుగా గిరిజన ప్రాంత ప్రజలకు అందని ద్రాక్షగా ఉన్న వైద్య విద్యను, పాడేరులో వైద్య కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా జగన్ సాకారం చేశారని కొనియాడారు.గిరిజన ప్రాంత ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా జీవో నంబరు 3 పునరుద్ధరణపై ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రెండేళ్లు గడుస్తున్నా దీనిపై స్పష్టత లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం ఓడిపోవడంతో, ఇక్కడి అభివృద్ధి పనులను కావాలనే నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులు ప్రతి ఎన్నికల్లోనూ ఓటు ద్వారా జగన్‌మోహన్‌రెడ్డిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారన్నారు. తమ పార్టీ గిరిజనుల పక్షాన నిలబడి పోరాడుతుందని అమర్‌నాథ్ పేర్కొన్నారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, నియోజకవర్గ పరిశీలకులు సత్యారావు, గండి రవి, ఎంపీపీలు కోరాబు అనూషదేవి, బోయిన కుమారి, వైస్ ఎంపీపీలు శారద, వెంగళరావు, పార్టీ మండల అధ్యక్షులు గణబాబు, మాజీ అధ్యక్షులు రవి, చీడికాడ మాజీ జెడ్పీటీసీ సుంకర శ్రీనివాస్, జల్లి సుధాకర్, జల్లి బాబులు, తాజా, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


