సాక్షి, పాడేరు: జిల్లా వ్యాప్తంగా దోమల నివారణ లక్ష్యంగా మొదట విడత దోమల మందు పిచికారి పనులు చేపడుతున్నామని కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. మండలంలోని ఉబ్బేటిపుట్టులో దోమల నివారణ మందు పిచికారి పనులను బుధవారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దోమల నివారణ మందును ప్రతి ఇంటిలోను తప్పనిసరిగా పిచికారి చేయాలన్నారు. ప్రజలు తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తితే సకాలంలో వైద్యసేవలు పొందాలన్నారు. దోమలు కుట్టడం వల్ల వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ జ్వరాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియాశాఖ అధికారి తులసీ, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ డి.ప్రతాప్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
బోసుబెడలో..
అరకులోయ టౌన్: మండలంలోని మాడగడ, గన్నెల పీహెచ్‌సీల పరిధిలో జరుగుతున్న దోమల నివారణ మందు స్ప్రేయింగ్ పనులను జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మలేరియా సోకకుండా ఉండేందుకు ప్రతీ ఇంట్లో దోమల నివారణ మందు పిచికారి చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ ఎం.బద్రయ్య, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ అప్పలస్వామి, సిబ్బంది నూకరాజు పాల్గొన్నారు.
కలెక్టర్ నిశాంతి


