మోదమ్మ జాతరను వైభవంగా నిర్వహిద్దాం | - | Sakshi
Sakshi News home page

మోదమ్మ జాతరను వైభవంగా నిర్వహిద్దాం

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

సాక్షి, పాడేరు: పాడేరు మోదకొండమ్మ తల్లి జాతరను మే 17, 18, 19 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహిద్దామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. మోదకొండమ్మ ఉత్సవాల నిర్వహణపై కలెక్టరేట్‌లో అధికారులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇది రాష్ట్ర పండగ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని, ఘాట్‌ రోడ్డు ప్రయాణాల్లో తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్‌ నిశాంతి మాట్లాడుతూ జాతర విజయవంతం కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎస్పీ అమిత్‌బర్దర్‌ మాట్లాడుతూ జాతర బందోబస్తుకు సుమారు 750 మంది పోలీసులు అవసరమని తెలిపారు. జిల్లాలోని ప్రత్యేక బలగాలు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల విధులకు వెళ్లినందున, బందోబస్తు సౌలభ్యం కోసం జాతర తేదీలను మార్చాలని ఇన్‌చార్జి మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పాడేరు ఎమ్మెల్యే, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక పాత బస్టాండ్‌ వద్ద నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్‌ను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పలువురికి స్వయంగా భోజనం వడ్డించారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి

Advertisement
 
Advertisement
Advertisement