రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం

గూడెంకొత్తవీధి: మండలంలోని జడుమూరు – నిమ్మలపాలెం మధ్య జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. వనబలింగం గ్రామానికి చెందిన చిలకల అబ్రహం (28), జడుమూరుకు చెందిన దేశగిరి కిషోర్‌ కుమార్‌ బుధవారం తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై వసువాడ నుంచి చిలకవీధి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో చింతపల్లి వైపు నుంచి అతివేగంగా వచ్చిన మరో ద్విచక్రవాహనం వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు అబ్రహం, కిషోర్‌ కుమార్‌ ఇద్దరూ రోడ్డుపై పడి తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. నెరెళ్లబంద గ్రామానికి చెందిన వంతల రమణబాబు తన వాహనాన్ని అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని గూడెంకొత్తవీధి సీఐ సుధాకర్‌ ప్రాథమిక విచారణలో వెల్లడించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికి అందిన కొడుకులు విగతజీవులుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఒక్క క్షణం జరిగిన అజాగ్రత్త, రెండు నిండు ప్రాణాలను బలితీసుకొని ఆ కుటుంబాల్లో ఎన్నటికీ పూడ్చలేని లోటును మిగిల్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన రమణబాబుపై చట్టపరమైన చర్యలు చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.

మృతులు అబ్రహం, కిషోర్‌కుమార్‌ (ఫైల్‌)

Advertisement
 
Advertisement
Advertisement